
టీ20లు ఆడి ఆడి అలవాటయ్యారో లేక టెస్టులు అంటే మరీ ఐదు రోజులు ఆడాలా..? అని అనుకుంటున్నారో తెలియదు గానీ ఇంగ్లాండ్ క్రికెట్ పంథా మారింది. స్వదేశంలో తమకు అనుకూలించే పిచ్ ల పైనే గాక విదేశాల్లో కూడా జోరు చూపిస్తామంటున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బెన్ స్టోక్స్ సేన.. కేన్ విలియమ్సన్ అండ్ కో. కు చుక్కలు చూపిస్తున్నది. ఈ టెస్టును మూడు రోజుల్లోనే ముగించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నది.
బే ఓవల్ లోని మౌంట్ మోంగనుయి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు 58.2 ఓవర్లే ఆడి 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసి డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్ ను ఫస్ట్ ఇన్నింగ్స్ లో 306 పరుగులకే కట్టడి చేసింది.
తొలి ఇన్నింగ్స్ లో కివీస్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (77) తో పాటు వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ లు రాణించారు. బ్లండెల్.. 181 బంతులాడి 19 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 138 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ మినహా మిగిలిన కివీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో19 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్ కు నాలుగు వికెట్లు దక్కగా అండర్సన్ 3 వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి: హాట్‌స్టార్ సర్వర్ డౌన్.. ఇండియా-ఆస్ట్రేలియా టెస్టు ప్రత్యక్ష ప్రసారానికి బ్రేకులు...
అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్.. 16 ఓవర్లు ఆడింది. రెండో రోజు స్టంప్స్ సమయానికి 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. జాక్ క్రాలే (28), బెన్ డకెట్ (25) లు ఔటయ్యారు. వన్ డౌన్ బ్యాటర్ ఒలి పోప్ (14 బ్యాటింగ్), నైట్ వాచ్‌మెన్ స్టువర్ట్ బ్రాడ్ (6) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 98 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఇదే దూకుడు రేపు కూడా కొనసాగితే న్యూజిలాండ్ కు స్వదేశంలో ఓటమి తప్పకపోవచ్చు. అదే జరిగితే కివీస్ కు ఇంగ్లాండ్ భారీ షాక్ ఇచ్చినట్టే. స్వదేశంలో తమకు అనుకూలంగా ఉన్న పిచ్ లపై పరాయి దేశం వచ్చి మూడు రోజుల్లోనే టెస్టును ముగిస్తే కివీస్ కు కోలుకోలేని దెబ్బే అవుతుంది.