David Warner: అవమానించారు.. అనుభవిస్తున్నారు..!! సన్ రైజర్స్ పై పగ తీర్చుకున్న వార్నర్

Published : May 05, 2022, 10:24 PM ISTUpdated : May 05, 2022, 10:30 PM IST
David Warner: అవమానించారు.. అనుభవిస్తున్నారు..!! సన్ రైజర్స్ పై పగ తీర్చుకున్న వార్నర్

సారాంశం

TATA IPL 2022 DC vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ కు తాను చేసిన తప్పేంటో తెలిసొచ్చినట్టుంది. ఒక్క సీజన్ లో అదీ  కొన్ని మ్యాచులు జట్టుకు విజయాలు అందించలేదనే నెపంతో  ఓ దిగ్గజ ఆటగాడినిక అవమానిస్తే అతడు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటాడో తెలిసొచ్చింది.  

ఐపీఎల్ లో ప్రత్యర్థులకు కొదవ లేదు. పగలు, ప్రతీకారాలకు లెక్కే లేదు. ఈ సీజన్ జరిగినన్ని రోజులూ ఇదే తంతు.  కానీ కొన్ని పగలు మాత్రం ప్రత్యేకం. తమను అకారణంగా అవమానించినందుకు ఆటగాళ్లు.. తమలోని  పూర్తి స్థాయి ఆటను బయటకు తీసి వారి ఆటతోనే సదరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అలాంటి విజయమే సాధించాడు డేవిడ్ వార్నర్ ఇవాళ (గురువారం).  ఐదు సీజన్ల పాటు జట్టును విజయవంతంగా నడిపించిన  ఆటగాడిని అవమానిస్తే ఎలా ఉంటుందో..? సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి రుచి చూపించాడు.  బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో 58 బంతుల్లోనే 92 పరుగులతో చెలరేగాడు. చెలరేగడం అంటే మామూలుగా కాదు.. అదేదో సినిమాలో చెప్పినట్టు.. ‘గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు..’  చాలా పద్ధతిగా..!!

2016లో ట్రోఫీని నెగ్గడమే గాక తర్వాత  ప్రతి సీజన్ లోనూ (2021 దాకా) సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ కు  వెళ్లిందంటే అది వార్నర్ చలవే.  తనదైన బ్యాటింగ్ తో జట్టులో ఎవరూ సహకరించకున్నా ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించాడు వార్నర్.  కానీ అంతటి వార్నర్ ను దారుణంగా అవమానించింది ఎస్ఆర్హెచ్ యాజమాన్యం. 

ఎస్ఆర్హెచ్ లో వార్నర్ ప్రస్థానమిది.. 

2014లో డేవిడ్ వార్నర్ ను వేలంలో దక్కించుకుంది సన్ రైజర్స్.  ఆ సీజన్ లోనే అతడికి కెప్టెన్పీని అప్పగించింది.  రెండు సీజన్ల పాటు ఎస్ఆర్హెచ్ లీగ్ స్టేజ్ దాటలేదు. అయితే 2016లో మాత్రం  ఏకంగా ట్రోఫీనే నెగ్గింది. ఆ తర్వాత 2017,  2018, 2019లలో ప్లేఆఫ్స్ చేరింది. 2018లో రన్నరప్ గా నిలిచింది.   కానీ 2021 లో  అత్యంత చెత్త ఆటతీరుతో లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. 

బ్యాటర్ గా కూడా  సూపరో సూపర్.. 

సన్ రైజర్స్  సారథిగా ముందుండి నడిపించమే కాదు బ్యాటింగ్ లో కూడా  వార్నర్ తనదైన ముద్ర వేశాడు. ఎస్ఆర్హెచ్ తరఫున 2014 నుంచి 2021 వరకు 95 మ్యాచులాడి.. ఏకంగా 4,014  పరుగులు చేశాడు. 2014 నుంచి వరుసగా వార్నర్ స్కోర్లు ఇవి.. 528, 562, 848, 641, 692, 548, 195.. అతడి ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 5,762 పరుగులు చేస్తే అందులో అగ్రభాగం సన్ రైజర్స్ లో చేసినవే కావడం గమనార్హం. 

 

ఒక్క సీజన్ లో ఆడలేదని.. 

2020 వరకు ఎస్ఆర్హెచ్ అంటే డేవిడ్ వార్నర్.. వార్నర్ అంటే ఎస్ఆర్హెచ్. అట్లా సాగింది అతడి ప్రయాణం. కానీ 2021లో  వరుసగా ఓటములు.  బ్యాటర్ గా కూడా విఫలమయ్యాడు. ఒకరకంగా ఇప్పుడు విరాట్ కోహ్లి అనుభవిస్తున్న దశనే  అప్పుడు వార్నర్ ది.  అయితే తమ జట్టుకు ఘనకీర్తిని తెచ్చిన  వార్నర్ పై సన్ రైజర్స్ కనికరం చూపలేదు. వరుస ఓటములు, బ్యాటర్ గా ఫెయిల్ అవుతున్నాడనే కారణంతో ముందు కెప్టెన్సీని ఊడబీకింది.   కేన్ విలియమ్సన్ ను సారథిగా చేసింది. కొన్ని మ్యాచుల్లో ఆడేందుకు అవకాశం ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏకంగా మ్యాచులలో కూడా పక్కనబెట్టింది. సన్ రైజర్స్ జెండా పట్టుకుని స్టాండ్స్ లో  ప్రేక్షకుల మధ్య వార్నర్ కూర్చున్న ఫోటోలు హైదరాబాద్ అభిమానుల గుండెను తాకాయి.  ఇక వార్నర్ తో హైదరాబాద్ బంధం వీడినట్టే అని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. 

అనుకున్నట్టుగానే.. సన్ రైజర్స్  యాజమాన్యం వార్నర్ ను అవమానించడమే గాక రిటెన్షన్ లో తీసుకోలేదు. విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్ ల  పేర్లను  ప్రకటించింది.  అప్పుడే వార్నర్ కూడా ట్విట్టర్ లో  ఆరెంజ్ ఆర్మీకి ధన్యవాదాలు చెబుతూ  వీడ్కోలు చెప్పాడు. తమవాడు కాకున్నా.. తమ దేశం కాకపోయినా వార్నర్ ను సొంత అన్నగా భావించారు హైదరాబాద్ అభిమానులు.  హైదరాబాద్ అభిమానులతో బాగా కలిసిపోయిన అతడు.. జట్టును అయిష్టంగానే వీడాడు. వార్నర్ జట్టును వీడటానికి గల  సరియైన కారణాలను సన్ రైజర్స్ ఇంతవరకు స్పష్టంగా వివరించలేదు.  వార్నర్ కూడా.. తనను కెప్టెన్ గా ఎందుకు తొలగించారో సన్ రైజర్స్ నాకు  సరైన సమాధానం చెప్పలేదని పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. 

కట్ చేస్తే.. 

రిటెన్షన్ లో వార్నర్ ను తీసుకోని ఎస్ఆర్హెచ్.. వేలంలో కూడా అతని వంక చూడలేదు. దీంతో రూ. 6.5 కోట్లకు అతడు తిరిగి తన పాత జట్టు (ఢిల్లీ క్యాపిటల్స్) కే చేరాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ అనగానే అందరి కళ్లూ సహజంగానే వార్నర్ మీదకే చేరాయి. వార్నర్ కూడా తాను యాజమాన్యంపై  పగ తీర్చుకోవాలనే తలంపుతోనే కనిపించాడు. తొలుత పది బంతుల పాటు వేచి చూసి బంతి గమనాన్ని అర్థం చేసుకున్న అతడు.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినప్పుడు కూడా వార్నర్ సంబురాలు చేసుకోలేదు. సెంచరీ కోసం తన ఆనందాన్ని దాచి పెట్టుకున్నాడు. అయితే ఆఖరి ఓవర్లలో సెంచరీ (92 నాటౌట్)కి దగ్గరగా వచ్చినా.. ఆఖరి ఓవర్లో పావెల్ వీర విహారంతో వార్నర్ కు క్రీజులోకి వెళ్లే అవకాశం రాలేదు. లేకుంటే సెంచరీ కూడా పూర్తి చేసి  సన్ రైజర్స్ యాజమాన్యానికి గట్టి హెచ్చరికలు పంపేవాడే. ఇప్పటికీ  వార్నర్ చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !
T20 World Cup India Squad : ప్రత్యర్థులకు దడ.. ఇది టీమిండియా నయా అడ్డా