IPL 2022: కసిగా బాదిన వార్నర్, పావెల్.. తీరుమారని హైదరాబాద్ బౌలర్లు.. ఢిల్లీ భారీ స్కోరు..

Published : May 05, 2022, 09:25 PM IST
IPL 2022: కసిగా బాదిన వార్నర్, పావెల్.. తీరుమారని హైదరాబాద్ బౌలర్లు..  ఢిల్లీ భారీ స్కోరు..

సారాంశం

TATA IPL 2022: బౌలింగ్ లో గత రెండు మ్యాచుల ప్రదర్శననే మళ్లీ కొనసాగించారు సన్ రైజర్స్ బౌలర్లు. ఢిల్లీ బ్యాటర్ల ధాటికి కళ్లకు తేలేయడం మినహా వాళ్లు చేయగలిగింది ఏమీ లేకపోయింది. ముఖ్యంగా  సన్ రైజర్స్ పై  ప్రతీకారం తీర్చుకోవాలనే తలంపుతో ఆడిన వార్నర్.. అనుకున్నది సాధించాడు. 

తనను  అకారణంగా అవమానించి, జట్టులోంచి వెళ్లగొట్టేలా చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై  డేవిడ్ వార్నర్ కసి తీరా పగ తీర్చుకున్నాడు.  దొరికిన బంతిని దొరికనట్టుగా బాదాడు. సన్ రైజర్స్  యాజమాన్యం పై అతడి  ప్రతీకారానికి   పాపం హైదరాబాద్ బౌలర్లు బలయ్యారు. అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్టైంది వాళ్ల పరిస్థితి.  58 బంతులాడిన వార్నర్ భాయ్.. 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో  92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వార్నర్ పగకు తోడు పావెల్ (35 బంతుల్లో 67 నాటౌట్.. 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రతాపం కూడా ఢిల్లీకి కలిసొచ్చింది. ఇద్దరూ కలిసి వీర బాదుడు బాదడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్.. మన్దీప్ సింగ్(0) ను ఔట్ చేశాడు. మొదటి ఓవర్ మేయిడిన్ తో పాటు వికెట్. ఢిల్లీ ఇన్నింగ్స్ లో సన్ రైజర్స్ కు సంతోషమిచ్చే విషయం అదొక్కటే.  ఆ తర్వాతే మొదలైంది అసలు తుఫాను. 

మన్దీప్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మార్ష్ (10) తో కలిసి  డేవిడ్ వార్నర్ చెలరేగి ఆడాడు. సీన్ అబాట్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు మార్ష్. ఇక ఉమ్రాన్ అక్మల్ వేసిన నాలుగో  ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్లు బాదాడు వార్నర్. ఆ ఓవర్లో మొత్తంగా 21 పరుగులొచ్చాయి ఢిల్లీకి. అయితే అబాట్ వేసిన ఐదో ఓవర్లో  తొలి బంతికి ఫోర్ కొట్టిన మార్ష్.. రెండో బంతికి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఆ క్రమంలో రిషభ్ పంత్ (16 బంతుల్లో 26.. 1 ఫోర్, 3 సిక్సర్లు) తో జతకూడిన వార్నర్.. తగ్గేదేలే అన్నట్టుగా ఆడాడు. త్యాగి వేసిన ఆరో ఓవర్లో 2 ఫోర్లు కొట్టాడు. ఇక శ్రేయస్ గోపాల్ వేసిన 9వ ఓవర్లో వరుసగా  మూడు సిక్స్ లు, ఫోర్ కొట్టిన పంత్.. అదే ఓవర్లో ఐదో బంతికి బౌల్డయ్యాడు.  అప్పటికీ ఢిల్లీ స్కోరు 9 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 85. 

పావెల్-వార్నర్ దంచుడే.. 

పంత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన రొవ్మన్ పావెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.  మరోవైపు ఉమ్రాన్ మాలిక్ వేసిన 12.1 ఓవర్లో తొలి బంతిని ఫోర్ కొట్టిన వార్నర్.. ఐపీఎల్ లో నాలుగో హాఫ్ సెంచరీ (మొత్తంగా టీ20లలో 89వ) పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి స్కోరు బోర్డు వేగాన్ని పెంచడమే గాక  సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. భువీ వేసిన 15.4 ఓవర్లో సిక్సర్ కొట్టిన పావెల్.. అబాట్ వేసిన 17వ ఓవర్లో  6, 6, 4 బాదాడు. పావెల్  ఆటతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చింది. మ్యాచ్ లో అతడు ఇచ్చిన క్యాచ్ లను కార్తీక్ త్యాగి, కేన్ విలియమ్సన్,  మార్క్రమ్ లు మిస్ చేశారు.  

మరోవైపు భువనేశ్వర్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లతో 90లలోకి చేరాడు  వార్నర్.   ఇదే క్రమంలో  ఉమ్రాన్ మాలిక్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాదిన పావెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత రెండు బంతులకు కూడా 3 ఫోర్లు. అయితే ఆ ఓవర్లో ఎక్కువగా పావెల్ బ్యాటింగ్ తీసుకోవడం వల్ల  వార్నర్ కు సెంచరీ చేసే అవకాశం రాలేదు. లేకుంటే సన్ రైజర్స్ పై కసితీరా సెంచరీ బాదేవాడే.  

ఢిల్లీ బ్యాటర్ల ధాటికి  సన్ రైజర్స్ బౌలర్లు తేలిపోయారు. ఒక్క భువనేశ్వర్ మినహా.. మిగిలిన  బౌలర్లంతా భారీగా పరగులిచ్చుకున్నారు. సీన్ అబాట్, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి,శ్రేయస్ గోపాల్ లు వార్నర్, పంత్, పావెల్ ల  బాదుడుకు బలయ్యారు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !