CSK vs RR: భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్... చెన్నైకి భారీ టార్గెట్..

By team teluguFirst Published Sep 22, 2020, 9:20 PM IST
Highlights

సునామీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సంజూ శాంసన్...

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్...

ఘోరంగా విఫలమైన మిడిల్ ఆర్డర్... సామ్ కుర్రాన్‌కి మూడు వికెట్లు

IPL 2020: సంజూ శాంసన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. యంగ్ బ్యాట్స్‌మెన్ 6 పరుగులు చేయగా, సంజూ శాంసన్ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 9 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 74 పరుగులు చేశాడు. శాంసన్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా 11.3 ఓవర్లలోనే 132 పరుగులు చేసింది రాజస్థాన్. అయితే సంజూ శాంసన్ అవుటైన తర్వాత రాజస్థాన్ ఇన్నింగ్స్ కుప్పకూలింది.

డేవిడ్ మిల్లర్ పరుగులేమీ చేయకుండానే రనౌట్ కాగా, రాబిన్ ఊతప్ప 5, రాహుల్ త్రివాటియా 10, రియాన్ పరాగ్ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేసి స్టీవ్ స్మిత్ కూడా వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో ఆర్చర్ వరుస సిక్సర్లతో విరుచుకుపడడంతో రాజస్థాన్‌కి భారీ స్కోరు దక్కింది. వరుసగా 4 భారీ సిక్సర్లు బాదిన ఆర్చర్ 8 బంతుల్లో  4 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. 

 

చెన్నై బౌలర్లలో సామ్ కుర్రాన్‌కు 3 వికెట్లు దక్కగా దీపక్ చాహార్‌, పియూష్ చావ్లాలకి తలా ఓ వికెట్ దక్కింది. 

click me!