CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం... పోరాడి ఓడిన చెన్నై...

By team teluguFirst Published Sep 22, 2020, 11:26 PM IST
Highlights

ఏ దశలోనూ లక్ష్యంవైపు పయనించని చెన్నై సూపర్ కింగ్స్...

రాహుల్ త్రివాటియాకు మూడు వికెట్లు...

వికెట్ కీపింగ్‌లోనూ అదరగొట్టిన సంజూ శాంసన్...

72 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన డుప్లిసిస్... ఓటమి ఖరారైన తర్వాత సిక్సర్లు బాదిన ధోనీ...

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది రాజస్థాన్ రాయల్స్. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో అద్భుత విజయం అందుకుంది. 217 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై, ఏ దశలోనూ లక్ష్యంవైపు పయనిస్తున్నట్టు కనిపించలేదు. డుప్లిసిస్ పోరాడినా రన్‌రేట్ భారీగా పెరగడంతో అప్పటికే ఓటమి ఖరారైంది. ఓపెనర్ షేన్ వాట్సన్ 21 బంతుల్లో 4 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 33 పరుగులు చేయగా, మురళీ విజయ్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సామ్ కర్రాన్ 17 పరుగులు చేయగా యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ వస్తూనే భారీ షాట్‌కు ప్రయత్నించి డకౌట్ అయ్యాడు.

కేదార్ జాదవ్ 22 పరుగులు చేయగా డుప్లిసిస్ మాత్రం ఆఖరిదాకా పోరాడాడు. సిక్సర్లు కొడుతూ రన్‌రేట్ తగ్గించే ప్రయత్నం చేశాడు. అయితే ధోనీ భారీ షాట్లు ఆడకుండా సింగిల్స్ తీయడంతో రన్‌రేటు భారీగా పెరిగిపోయింది.  37 బంతుల్లో 7 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 72 పరుగులు చేసి అవుట్ అయ్యాడు డుప్లిసిస్. ఆఖర్లో మహేంద్ర సింగ్ 28, జడేజా 1 పరుగు చేశారు. 4 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన సమయంలో ధోనీ, వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. అయితే అప్పటికే చెన్నై ఓటమి ఖరారైంది. ధోనీ ఓ రెండు ఓవర్ల ముందు ఇలా ఆడి ఉంటే చెన్నైకి విజయం దక్కి ఉండేది. 

సెన్సేషనల్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సంజూ శాంసన్, వికెట్ కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. సామ్ కర్రాన్, రుతురాజ్ గైక్వాడ్‌లను స్టంప్ అవుట్ చేసిన సంజూ, కేదార్ జాదవ్‌ను అద్భుతమైన క్యాచ్‌తో అవుట్ చేశాడు. రాహుల్ త్రివాటియాకు 3 వికెట్లు దక్కగా, శ్రేయాస్ గోపాల్, టామ్ కుర్రాన్ చెరో వికెట్ తీశారు. 

click me!