కామన్వెల్త్ గేమ్స్: భారత్ - పాక్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి... రద్దయితే టీమిండియాకి భారీ నష్టం...

By Chinthakindhi RamuFirst Published Jul 31, 2022, 3:59 PM IST
Highlights

వర్షం కారణంగా గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్..

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భాగంగా నేడు భారత మహిళా క్రికెట్ జట్టు, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది. బర్మింగ్‌హమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30కు) మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది...

అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు భారీ వర్షం కురవడంతో టాస్ కూడా ఆలస్యమైంది. దాదాపు 45 నిమిషాల తర్వాత వరుణుడు కాస్త బ్రేక్ ఇవ్వడంతో 11:25కి టాస్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. వర్షం కారణంగా విలువైన సమయం కోల్పోవడంతో చెరో 2 ఓవర్లను కుదించి, 18 ఓవర్ల పాటు మ్యాచ్‌ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత జట్టు తొలుత ఫీల్డింగ్ చేయనుంది. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌కి దూరమైన సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్ నేటి మ్యాచ్‌లో భారత జట్టుకి అందుబాటులోకి వచ్చారు. తెలుగు బ్యాటర్ సబ్బినేని మేఘనకు తుది జట్టులో చోటు దక్కగా ఫిట్‌నెస్ లోపం కారణంగా పూజా వస్త్రాకర్‌ రిజర్వు బెంచ్‌కే పరిమితమైంది..

ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ పరాజయం కారణంగా భారత్‌ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలిచి తీరాల్సిందే. పాకిస్తాన్‌పై గెలిచిన బర్బొడాస్ వుమెన్స్ టీమ్, పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది...

రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా... ఇంకా ఒక్క విజయం కూడా అందుకోని భారత్, పాకిస్తాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు విజయం అందుకుంటే ఆగస్టు 3న బర్బొడాస్‌ని ఓడిస్తే నేరుగా ఫ్లేఆఫ్స్‌కి అర్హత సాధించగలుగుతుంది. 

పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టు స్వల్ప తేడాతో గెలిచినా, ఓడినా భారత జట్టుకి అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఆ ప్రభావం టీమిండియా ప్లేఆఫ్స్ ఛాన్సులపై తీవ్రంగా పడుతుంది... 

భారత జట్టు ఇది: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యషికా భాటియా (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్ 

పాకిస్తాన్ జట్టు ఇది: ఇరం జావెద్, మునీబా ఆలీ (వికెట్ కీపర్), ఒమామియా సోహైల్, బిస్మా మరూఫ్ (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా నసీం, ఖైనత్ ఇంతియాజ్, ఫాతిమా సనా, తుబా హసన్, డియానా బైగ్, అనమ్ అమీన్

click me!