హమ్మయ్య.. ఐపీఎల్ ఆడనందుకు నేను హ్యాపీ.. లేకుంటే అది జరిగేది కాదు.. పుజారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By Srinivas MFirst Published May 23, 2022, 3:40 PM IST
Highlights

Cheteshwar Pujara: టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా స్వల్ప విరామం తర్వాత  జాతీయ జట్టులోకి తిరిగి ఎంపికయ్యాడు. కౌంటీలలో అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న అతడు ఇంగ్లాండ్ తో టెస్టు ఆడనున్నాడు. 

ఐపీఎల్ అంటేనే కాసుల పంట. ఈ లీగ్ లో రెండు మూడు సీజన్లు ఆడినా  లైఫ్ సెట్ అవుద్దని  భావిస్తుంటారు క్రికెటర్లు. ఇక ఒక సీజన్ లో అదరగొడితే వాళ్లకు తర్వాత సీజన్ వేలానికి కోట్లలో ధర పలుకుతుంది. అంతటి  క్యాష్ రిచ్ లీగ్ లో ఎలాగైనా మెరవాలని, జీవితాలు సెట్ చేసుకోవాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటారు. కానీ టీమిండియా నయావాల్ ఛతేశ్వర్  పుజారా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఐపీఎల్ ఆడకపోవడమే తనకు మంచిదైందని  అతడు అంటున్నాడు. ఐపీఎల్ తో పాటు తన కౌంటీ ప్రదర్శన, టీమిండియాలోకి తిరిగి ఎంపికవడంపై నయావాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పుజారా మాట్లాడుతూ.. ‘మీరు ఒకటి ఆలోచించండి.. ఒకవేళ ఐపీఎల్ లో నన్ను ఏదైనా జట్టు దక్కించుకుంటే నేను తుదిజట్టులో ఉంటానా..? అసలు నాకు ఆడే అవకాశం ఇస్తారా..? మ్యాచ్ కు ముందు నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం తప్ప  నాకు అక్కడ ఏమీ ఉండదు.. 

కానీ నేను కౌంటీలు ఆడితే నాకుఇక్కడ నెట్ ప్రాక్టీస్ తో  పాటు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభిస్తుంది. నెట్ ప్రాక్టీస్ కంటే మ్యాచ్ ప్రాక్టీస్ ఎంతో బెటర్ కదా.. అందుకే నాకు కౌంటీలలో ఆడే అవకాశం వచ్చినప్పుడు నో చెప్పాలనిపించలేదు.  ఇక్కడికొచ్చి నన్ను  నేను నిరూపించుకోని తిరిగి జట్టులోకి రావాలనే ఆలోచనతో  నేను కౌంటీలు ఆడలేదు.  నేను కోల్పోయిన రిథమ్ ను తిరిగి పొందడానికే ఇక్కడికి వచ్చాను...’ అని అన్నాడు. 

అంతేగాక.. ‘నేను ఇక్కడికే రావడమే పాజిటివ్ దృక్పథంతో వచ్చాను. అందులో సందేహమే లేదు. నేను తిరిగి భారత జట్టులో భాగమౌతాననే నమ్మకముంది.  కానీ టీమిండియాలోకి రీఎంట్రీ కోసం మాత్రం నేను ఆడలేదు. ఒక మంచి ఇన్నింగ్స్ పడితే  నేను తిరిగి పాత లయను అందుకుంటానని  నమ్మకం నాకుంది..’ అని చెప్పాడు.  

 

Test squad for the fifth rescheduled Test against England 👇👇 pic.twitter.com/USMRe0kj1i

— BCCI (@BCCI)

ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ఐపీఎల్ వేలంలో పుజారాను ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. అదీగాక కొద్దికాలంగా పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్న అతడిని శ్రీలంకతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో  సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో పుజారా.. ఐపీఎల్-15 ప్రారంభమయ్యాక ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీలు ఆడుతున్నాడు. కౌంటీలలో ససెక్స్ తరఫున ఆడుతున్న ఈ నయావాల్.. ఐదు మ్యాచులలో ఏకంగా 720 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు (రెండు డబుల్ సెంచరీలు) ఉన్నాయి. కౌంటీలలో అదరగొట్టడంతో  సెలెక్టర్లు పుజారాను తిరిగి భారత టెస్టు జట్టులోకి ఎంపిక చేశారు. 

click me!