
కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని, ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ టీమిండియా, కెకెఆర్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఓవైపు తమ జట్టు ఓడిపోయిందని బాధపడుతూనే మరోవైపు గెలిచిన జట్టు తరపున గంగూలీ వుండటం ఆనందంగా వుందన్నాడు. ఇప్పటికే గంగూలీపై తన అభిమానాన్ని చాటుకున్ని షారుఖ్ మరోసారి దాన్ని బయటపెట్టుకున్నాడు.
సొంత మైదానం ఈడెన్ లో జరిగిన మ్యచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు షారుఖ్ స్టేడియానికి విచ్చేశాడు. అయితే కోల్ కతా బ్యాటింగ్ చేసినంతసేపు అతడు ఉత్సాహంగా కనిపించినా బౌలింగ్ విషయంలో పేలవ ప్రదర్శన చేయడంతో నిరాశగా కనిపించాడు. ఇలా ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరకు డిల్లీ జట్టే విజయం సాధించింది.
ఈ మ్యాచ్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందించిన షారుఖ్ ఈ విధంగా ట్వీట్ చేశాడు. '' మరోసారి శుభ్ మన్ గిల్, రస్సెల్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మ్యాచ్ ఓడిపోవడం ఓకే కానీ బౌలింగ్ కారణంగా ఓడిపోవడం గుండెల్ని మెలిపెట్టింది. ఇది చాలా దురదృష్టకరం. కానీ ఈ మ్యాచ్ లో వున్న ఏకైక సానుకూల అంశం ఏంటంటే గెలిచిన జట్టు వైపు దాదా(సౌరవ్ గంగూలి) వుండటమే. కంగ్రాట్స్ డిల్లీ క్యాపిటల్స్ '' అని పేర్కొన్నారు.
ఒకప్పటి కేకేఆర్ కెప్టెన్ గంగూలీపై తనకు ఏమాత్రం అభిమానం తగ్గలేదని ఈ ట్వీట్ ద్వారా షారుఖ్ బయటపెట్టాడు. దీంతో కేకేఆర్ అభిమానులే కాదు క్రికెట్ అంటే అభిమానించే ప్రతి ఒక్కరు షారుఖ్ స్పోర్టివ్ మెంటాలిటీకి పిదా అయిపోయారు. జట్టుతో సంబంధం లేకుండా తన అభిమానాన్ని నిరభ్యంతరంగా చాటుకున్న షారుఖ్ ట్రూ కింగ్ ఇన్ ఆల్ సెన్స్ అని ప్రశంసిస్తున్నారు.