
ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ నెగ్గని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తోపు ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నా దిగ్గజ కెప్టెన్లు ఆర్సీబీని నడిపించినా ఆ ఫ్రాంచైజీకి ట్రోఫీని సాధించింది ఎవరూ లేరు. ఈ సీజన్ లో వేలంలో దక్కించుకున్న ఫాఫ్ డుప్లెసిస్ అయినా తమ రాత మారుస్తాడని ఆ జట్టు ఆశగా ఎదురుచూసింది. కానీ ‘గోశిలో ఉన్న దరిద్రం కాశీకి పోయినా పోదన్న’ట్టు ఆ జట్టుకు ఏం శాపమో ఏమో గానీ ఈసారి ట్రోఫీ సంగతి పక్కనబెడితే కనీసం ప్లేఆఫ్ చేరడం కూడా గగనమే. శుక్రవారం పంజాబ్ తో ముగిసిన మ్యాచ్ లో ఆ జట్టు ఓడటానికి నల్లపిల్లి కారణమైందట. ఆ కథాకమామీషు ఏంటంటే..
సాధారణంగా మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు పిల్లి ఎదురైతే మంచిది కాదంటారు. అలాంటిది నల్ల పిల్లి ఎదురైతే ఇంకేమైనా ఉందా..? ఆ పని జరిగినట్టే. పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో కూడా నల్ల పిల్లి ఎదురువచ్చింది. ఇంకేముంది ఫలితం ఊహించిందే. నల్ల పిల్లి శాపం ఆర్సీబీకి తాకింది...!
ఆర్సీబీ బ్యాటింగ్ కు వచ్చిన తొలి ఓవర్ మూడో బంతి కి ఆ జట్టు సారథి ఫాఫ్ డుప్లెసిస్ క్రీజులోకి వచ్చాడు. అప్పుడే బ్యాటర్లకు ఎదురుగా ఉండే నల్లటి సైట్ స్క్రీన్ మీదకు ఓ నల్లపిల్లి వచ్చింది. అక్కడ అది దర్జాగా కూర్చుని పాపం మ్యాచ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నది. ఇది గమనించిన డుప్లెసిస్.. తనకు సైట్ స్క్రీన్ లో ఇబ్బంది ఉందని అంపైర్ కు చెప్పాడు. అంపైర్ గ్రౌండ్ సిబ్బందికి చెప్పి ఆ పిల్లిని అక్కడ్నుంచి పంపించేశారు.
అయితే మ్యాచ్ ముగిసి ఆర్సీబీ ఓడిన తర్వాత తమకు ఎదురైన పరాభవాన్ని నల్లపిల్లి మీదకు తోశారు బెంగళూరు అభిమానులు. నల్లపిల్లి ఎదురు రావడం వల్లే తాము ఓడిపోయామని.. ‘ఆడలేక మద్దెల దరువు’ సామెతను గుర్తు చేశారు. పాడు పిల్లి రావడం వల్లే తాము ఓడామని, లేకుంటే 210 పరుగుల లక్ష్యాన్ని ఒంటిచేత్తో కొట్టిపారేయగల సమర్థమైన ఆటగాళ్లు తమకు ఉన్నారని భీరాలు పలుకుతున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు కామెంటరీ బాక్స్ లో ఉన్న హర్షా బోగ్లే కూడా.. ‘ఓ.. నల్లపిల్లి.. నువ్వు శాపం పెట్టకు’ అని కూడా వేడుకోవడం విశేషం. ఏదేమైనా నల్లపిల్లి కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక పంజాబ్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పాటిదార్, దినేశ్ కార్తీక్ వంటి హిట్టర్లున్న ఆర్సీబీ.. 155 పరుగులకే పరిమితమైంది. కోహ్లి ఎప్పటిలాగే విఫల ఫామ్ ను కొనసాగించగా.. మిగతా వాళ్లు అతడినే అనుసరించారు. ఫలితంగా పంజాబ్.. 54 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ 13 మ్యాచులాడిన ఆర్సీబీ.. 7 విజయాలు, 6 పరాజయాలతో ప్లేఆఫ్ రేసులో వెనుకబడింది. తర్వాత ఆడబోయే మ్యాచ్ లో గెలిస్తేనే ఆ జట్టుకు అవకాశాలుంటాయి. లేకుంటే అంతే..