
పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు సారథి బిస్మా మరూఫ్ తన బాధ్యతల నుంచి తప్పుకుంది. జాతీయ జట్టుకు ఇక తాను సారథిగా ఉండలేనని కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగింది. 2016 నుంచి పాకిస్తాన్ సారథిగా ఉన్న ఆమె.. కీలక టోర్నీలలో వైఫల్యంతో తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్నది. గడిచిన రెండు ఐసీసీ టీ20 ప్రపంచకప్ లలో పాకిస్తాన్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనే గెలిచింది.
2020లో జరిగిన టీ20 ప్రపంచకప్ తో పాటు ఇటీవల దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన టోర్నీలో కూడా పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గింది. అదీగాక గత కొంతకాలంగా ఆ జట్టు ద్వైపాక్షిక సిరీస్ లలో కూడా తడబడుతోంది. ఈ నేపథ్యంలో ఇక తప్పుకోవడమే మంచిదనుకున్న మరూఫ్.. ఈ ప్రకటన చేసింది.
ఆమె కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ నజమ్ సేథీ కూడా తెలిపాడు. ట్విటర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశాడు. అయితే సారథిగా తప్పుకున్నా ఆమె ప్లేయర్ గా అందుబాటులో ఉంటుందని చెప్పాడు.
తాను సారథిగా తప్పుకోవడంపై మరూఫ్ తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ... ‘పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇంతమంది హార్డ్ వర్కింగ్ క్రికెటర్స్ తో కలిసి పనిచేయడం అత్యద్భుతం. కెప్టెన్ గా ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్షిప్ సైకిల్ తో పాటు 2024లో టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు సారథ్య పగ్గాలు ఇవ్వడమే మంచిదని నిశ్చయించుకున్నా. కొత్త కెప్టెన్ కు నా సహాయ సహకరాలు అందిస్తా...’అని తెలిపింది.
బిస్మా.. 2016లో మాజీ సారథి సనా మిర్ నుంచి సారథ్య పగ్గాలు అందుకుంది. ఆ ఏడాది సనా టీ20ల నుంచి తప్పుకుని బిస్మాకు బాధ్యతలు అందజేసింది. ఆ తర్వాత ఏడాది వన్డే కెప్టెన్సీ పగ్గాలూ దక్కాయి. అప్పట్నుంచి ఇప్పటిదాకా మరూఫ్.. పాకిస్తాన్ కు 64 టీ20, 34 వన్డే మ్యాచ్ లలో సారథిగా వ్యవహరించింది. టీ20లలో 27, 16 వన్డేలలో గెలిచింది.
మొత్తంగా బిస్మా పాకిస్తాన్ తరఫున 108 వన్డేలు, అన్నే టీ20 మ్యాచ్ లు ఆడింది. వన్డేలలో 2,602 పరుగులు చేయగా టీ20లలో 2,202 పరుగులు చేసింది. 2006 నుంచి పాకిస్తాన్ కు ఆడుతున్న మరూఫ్.. 2021లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా మరూఫ్ కూతురుతో భారత క్రికెటర్లు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే.