వైస్ కెప్టెన్ తో పాటు ఏడుగురు అండర్-19 క్రికెటర్లకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఆ నిబంధన చూపి..

Published : Feb 08, 2022, 01:54 PM IST
వైస్ కెప్టెన్ తో పాటు ఏడుగురు అండర్-19 క్రికెటర్లకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఆ నిబంధన చూపి..

సారాంశం

IPL2022 Auction: అండర్ -19 ప్రపంచకప్ గెలిచిన కుర్రాళ్లకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షాకిచ్చింది. భారత్ కు ఐదో ప్రపంచకప్ అందించిన కుర్రాళ్లను ఐపీఎల్ లో మాత్రం...  

వెస్టిండీస్ వేదికగా ఇటీవలే ముగిసిన అండర్-19 ప్రపంచకప్ లో  టీమిండియా కుర్రాళ్లు  అదరగొట్టారు. ఇంగ్లాండ్ తో ముగిసిన ఫైనల్ లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి భారత్ కు ఐదో అండర్-19 ప్రపంచకప్ ను అందించారు.  అయితే భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పలువురు యువ క్రికెటర్లకు బీసీసీఐ భారీ షాకిచ్చింది. బీసీసీఐ నిబంధనల కారణంగా ఇప్పుడు అండర్-19 జట్టులోని  ఏకంగా ఎనిమిది మంది క్రికెటర్లు ఐపీఎల్ వేలంలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు. జాబితాలో మన ఆంధ్ర కుర్రాడు, అండర్-19 ప్రపంచకప్ లో పాల్గొన్న భారత జట్టులో వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన షేక్ రషీద్ కూడా ఉన్నాడు. 

ఐపీఎల్ ఆడాలన్న కలతో ఉన్న భారత కుర్రాళ్లకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. షేక్ రషీద్ తో పాటు 7 మంది క్రికెటర్లు  ఈసారి వేలంలో పాల్గొనే అవకాశం లేదు.  బీసీసీఐ విధించిన వయసు, ఇతర నిబంధనలు ఈ ఆటగాళ్ల ఐపీఎల్ డ్రీమ్స్ కు అడ్డంగా నిలిచాయి. 

ఏంటా నిబంధనలు..? 

- ఐపీఎల్ ఆడే క్రికెటర్ వయసు కనీసం 19 ఏండ్లు ఉండాలి. 
- సదరు ఆటగాడు కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్ ఏ మ్యాచ్ ఆడి ఉండాలి. 
- దేశవాళీ క్రికెట్ (కనీసం ఒక్క మ్యాచ్ అయినా) ఆడిన  అనుభవం లేకుంటే వాళ్లు ఐపీఎల్ వేలంలో భాగం కాలేరు. 

ఇప్పుడు ఈ నిబంధనలు  అండర్-19 ప్రపంచకప్ కుర్రాళ్ల కొంప ముంచాయి.  వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కెప్టెన్ యశ్ ధుల్ మినహా.. షేక్ రషీద్, వికెట్ కీపర్ దినేష్ బానా, యువ పేసర్ రవికుమార్, ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ,  ఆల్ రౌండర్లు నిశాంత్ సింధు, సిద్ధార్థ యాదవ్  లతో పాటు మానవ్ ప్రకాశ్, గర్వ్ సంగ్వాన్లకు ఐపీఎల్ వేలం ఫైనల్ లిస్టులో పేరు దక్కలేదు. 

బీసీసీఐ కారణం.. 

వయసు పరమైన ఇబ్బందులు మినహాయిస్తే పైన పేర్కొన్న ఆటగాళ్లు దేశవాళీ  క్రికెట్ ఆడకపోవడానికి బీసీసీఐనే కారణం.  గడిచిన రెండేండ్లలో కరోనా కారణంగా బీసీసీఐ.. రంజీ ట్రోఫీతో పాటు ఇతర  మేజర్ దేశవాళీ సీజన్ కూడా నిర్వహించలేదు. దీంతో ఈ ఆటగాళ్లకు తమ రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశమే రాలేదు. 

బీసీసీఐ కరుణ చూపేనా..?

అయితే  నిబంధనల పేరు చెప్పి ఈ కుర్రాళ్ల ఐపీఎల్ కలలను చిదిమేయొద్దని పలువురు క్రీడా విశ్లేషకులు బీసీసీఐని కోరుతున్నారు. ఇదే విషయమై స్వయంగా బీసీసీఐకి చెందిన అడ్మినిస్ట్రేటర్ రత్నాకర్ శెట్టి మాట్లాడుతూ... ‘ఈసారి ఐపీఎల్ ఆడాలన్న  అండర్-19 కుర్రాళ్ల కలలపై బీసీసీఐ పునరాలోచించాలి. ఈ జట్టు  ప్రపంచకప్ లో భాగా రాణించింది. వారికి అవకాశం కల్పించాలి..’ అని  అన్నాడు. అయితే దీనిపై  తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

ఒకవేళ బీసీసీఐ.. పై నిబంధనలను సడిలిస్తే మాత్రం రషీద్ తో పాటు మిగిలిన ఏడుగురు క్రికటర్లు వేలంలోకి వస్తారు.  ఆసక్తి ఉన్న ఫ్రాంచైజీలు ఈ యువ క్రికెటర్లను దక్కించుకునే అవకాశం కూడా ఉంది. కాగా, ఆంధ్రా కుర్రాడు  షేక్ రషీద్.. టోర్నీ మధ్యలో కరోనా బారిన పడ్డా క్వార్టర్స్ కు ముందు కోలుకున్నాడు. క్వార్టర్స్ లో బంగ్లాదేశ్ పై రాణించిన అతడు.. సెమీస్ లో ఆసీస్ పై 94 పరుగులు చేశాడు. ఇక ఫైనల్ లో హాఫ్ సెంచరీతో  భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

రషీద్ తో పాటు వికెట్ కీపర్ దినేష్ బానా కూడా మంచి ఫినిషర్. ఇప్పటికే అతడిని భవిష్యత్ ధోనితో పోలుస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.  రవికుమార్ తన స్వింగ్ తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టగల సమర్థుడు. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?