ఐసీసీ పై భువీ అసంతృప్తి: అలా చేస్తే సగం బలంతోనే పోరాడాలి

By Sreeharsha GopaganiFirst Published Jul 1, 2020, 12:23 PM IST
Highlights

కరోనా వైరస్‌ సోకకుండా నివారణ చర్యల్లో భాగంగా బంతిపై మెరుపు నిలుపేందుకు ఉమ్మి వాడటంపై ఐసీసీ నిషేధం విధించింది.భారత స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఉమ్మి వాడటంపై నిషేధం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అధిక వేగంతో బంతులు వేసే బౌలర్లకు ఇది సమస్య కాకున్నప్పటికీ.... స్వింగ్ ను  నమ్ముకున్న బౌలర్లకు ఇది సమస్య అంటున్నాడు. 

కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచం స్తంభించిపోయింది. క్రికెట్ ఆట కూడా అన్ని ఆటలమాదిరే బ్రేక్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆటలో తొలి అడుగులు పడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరింది. 

కోవిడ్‌-19 మహమ్మారి వరల్డ్‌ క్రికెట్‌కు ఎన్నో సవాళ్లు విసిరింది. కరోనా సవాళ్లకు సంపూర్ణ పరిష్కారం కనుగొనకుండానే క్రికెట్‌ పున ప్రారంభానికి ముస్తాబవుతోంది. జులై 8 నుంచి సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌లు తొలి టెస్టులో పోటీపడనున్న సంగతి తెలిసిందే. 

కరోనా వైరస్‌ సోకకుండా నివారణ చర్యల్లో భాగంగా బంతిపై మెరుపు నిలుపేందుకు ఉమ్మి వాడటంపై ఐసీసీ నిషేధం విధించింది. ఉమ్మికి ప్రత్యామ్నాయంగా చెమట (స్వేదం) వాడమని ఉచిత సలహా ఇచ్చినా.. పేస్‌ బౌలర్లు ఉమ్మి లేకుండా బంతిపై మెరుపు ఉంచేందుకు ఏం చేయాలనే ఆలోచనల్లో తలమునకలై ఉన్నారు. 

భారత స్వింగ్‌స్టర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సైతం ఇదే ఆలోచనల్లో ఉన్నాడు. స్పోర్ట్స్‌పవర్‌ నిర్వహించిన వెబినార్‌లో భువనేశ్వర్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అధిక వేగంతో బంతులు వేసే బౌలర్లకు ఇది సమస్య కాకున్నప్పటికీ.... స్వింగ్ ను  నమ్ముకున్న బౌలర్లకు ఇది సమస్య అంటున్నాడు. 

'145 కెఎంపిహెచ్‌ వేగంతో బంతులేసే బౌలర్లకు ఇది పెద్ద సమస్య కాదు. ఆ బౌలర్లు పేస్‌ను మరింత పెంచుకుంటారు. స్వింగ్‌నే నమ్ముకున్న నా వంటి పేసర్లకే ఇది సవాల్‌. స్వింగ్‌ లేకుండా క్రికెట్‌ పూర్తిగా బ్యాట్స్‌మెన్‌ ఆటగా మారుతుంది. 

ఇంగ్లాండ్‌ వంటి పరిస్థితులు స్వింగ్‌కు అనుకూలం. కానీ కొన్ని ఓవర్ల తర్వాత, బంతిపై మెరుపు నిలుపలేం. నా వంటి బౌలర్లకు స్వింగ్‌ లేకపోవటం, సగం బలంతోనే ఆడటం వంటిది. ఇది నిజంగా క్లిష్టమైన పరిస్థితి. ఐసీసీ దీనిపై త్వరలోనే ఓ పరిష్కారం చూపిస్తుందని అనుకుంటున్నాను. క్రికెట్‌ మొదలైన తర్వాత, బంతిపై మెరుపు నిలిపేందుకు మేమే ఓ దారి కనుగొంటామని ఆశిస్తున్నాను. క్రికెట్‌కు బంతిపై మెరుపు ఎంతో ప్రధానం. స్వింగ్‌ బౌలర్లకే కాదు స్పిన్నర్లకూ బంతిపై మెరుపు కీలకం' అని భువనేశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నాడు.

click me!