టీమిండియా కెప్టెన్ మార్పు: అలా జరిగితే కోహ్లీ స్థానంలో రోహిత్ ఉంటాడన్న మాజీ క్రికెటర్

By Siva KodatiFirst Published Jun 30, 2020, 4:50 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్సీ మార్పు చేయాలని బీసీసీఐ భావిస్తే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ రెడిమేడ్‌గా ఉన్నాడని అన్నారు మాజీ టెస్ట్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

టీమిండియా కెప్టెన్సీ మార్పు చేయాలని బీసీసీఐ భావిస్తే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ రెడిమేడ్‌గా ఉన్నాడని అన్నారు మాజీ టెస్ట్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. స్పోర్ట్స్ యాంకర్ సవేరా పాషాతో జరిగిన యూట్యూబ్ ఇంటరాక్షన్ సందర్భంగా ఆకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతానికి భారత ఆటతీరు బాగానే ఉందన్న ఆయన.. రానున్న కాలంలో జట్టు ఫర్ఫామెన్స్‌లో ఏమైనా లోపాలు కనిపిస్తే కొత్త కెప్టెన్‌ను చూసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీని తప్పుబట్టలేమని.. కానీ జట్టుగా చూస్తే మాత్రం కెప్టెన్‌గా ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఒకవేళ ఐసీసీ ఈవెంట్స్‌లో టీమిండియా టైటిల్ నెగ్గకపోతే మాత్రం నాయకత్వ మార్పు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు.

అయితే రానున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఎందుకంటే 2013 తర్వాత భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలేదని, అంతేకాకుండా 2021లో టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగనుందని చోప్రా తెలిపాడు.

ఒకవేళ ఈ రెండింటిలో ఏ ఒక్కటి గెలవకపోతే మాత్రం జట్టు మేనేజ్‌మెంట్ నాయకత్వ మార్పు గురించి ఆలోచించాల్సిందేనని ఆకాశ్ అన్నారు. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాత్రం కోహ్లీ లాంటి ఆటగాడిని కెప్టెన్సీ పదవి నుంచి తీసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు.

అతను ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గాను విజయవంతం అయ్యాడని గుర్తుచేశాడు. మరోవైపు కెప్టెన్సీ నుంచి తొలగిస్తే అతను ఒత్తిడికి లోనవ్వకుండా తన ఆట తాను ఆడుకుంటాడని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అతుల్ వాసన్ తెలిపారు.

అయితే అతుల్ వ్యాఖ్యలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొట్టిపారేశారు. 2014లో ధోనీ నుంచి టెస్టు క్రికెట్ కెప్టెన్‌‌‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి కోహ్లీ జట్టును బాగానే  నడిపించాడు.

2017లో వన్డే కెప్టెన్సీ నుంచి స్వీకరించిన తర్వాత ఐసీసీ ఈవెంట్స్‌ టైటిళ్లను మాత్రం గెలిపించలేకపోయాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లో కివీస్ చేతిలో ఓటమిపాలవ్వడంతో కోహ్లీ విమర్శలు మూటగట్టుకున్నాడు. 
 

click me!