
వయసును తక్కువగా చూపి ఇటీవలే ముగిసిన అండర్-19 ప్రపంచకప్ లో ఆడాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న యువ క్రికెటర్ రాజవర్ధన్ హంగర్గేకర్ కు ఊరట. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులత శాఖ కమిషనర్ ప్రకాశ్ బకొరియా.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జై షా కు లేఖ రాసిన విషయం తెలిసిందే. హంగర్గేకర్ తీరు వల్ల అంతర్జాతీయ స్థయిలో భారత క్రికెట్ పరువు పోయిందని...ఇలాంటివాటిని ఉపేక్షించొద్దని బకొరియా కోరాడు. ఈ నేపథ్యంలో అతడిపై బీసీసీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందా..? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈ యువ క్రికెటర్ పై వస్తున్న ఆరోపణలను బీసీసీఐ పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. హంగర్గేకర్ విషయంలో ఆరోపణలను కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అతడిపై చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తున్నది.
ఇదే విషయమై బీసీసీఐ కి చెందిన ఓ అధికారి స్పందిస్తూ..‘2016లో అతడు మహారాష్ట్ర తరఫున ఆడాడు. ఆ సమయంలోనే హంగర్గేకర్ వయసుకు సంబంధించిన ధృవ పత్రాలను తనిఖీ చేశాం. ఇక ఇప్పుడు కొత్తగా విచారించాల్సింది ఏముంటుంది..? వాటి ప్రకారమే అతడి వయసును ధ్రువీకరించాం..’ అని తెలిపాడు. దీనిని బట్టి బీసీసీఐ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తున్నది.
2001 జనవరి 10న జన్మించిన రాజవర్థన్ హంగర్కేకర్ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నివాసి. అయితే అతడు.. 2002 నవంబర్ 10న జన్మించినట్టుగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి.. అండర్-19 భారత జట్టులో చోటు దక్కించుకున్నట్టుగా ఓంప్రకాశ్ బకోరియా ఆరోపణలు చేశాడు. అందుకోసం అతడు తన స్కూల్ లో కూడా బర్త్ సర్టిఫికెట్ ను మార్చాడని బకోరియా ఆరోపిస్తున్నాడు. దీనిపై విచారణ జరిపించాలని, ఒకవేళ టెర్నా పబ్లిక్ స్కూల్ (ఉస్మానాబాద్ లో హంగర్గేకర్ చదుకువున్న పాఠశాల) హెడ్ మాస్టర్ కూడా తప్పుడు ధృవ పత్రాలను ఇచ్చినట్టైతే అతడిని కూడా సస్పెండ్ చేయాలని బకోరియా.. బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.
అండర్-19 ప్రపంచకప్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా అదరగొట్టిన ఈ యువ ఆల్ రౌండర్ ను ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. రూ. 1.5 కోట్లకు దక్కించుకుంది. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అయిన హంగర్గేకర్.. మంచి హిట్టర్ కూడా..