రెండో టీ20లో టీమిండియా ఘన విజయం... టీ20 సిరీస్ కూడా రోహిత్ సేనదే...

Published : Feb 18, 2022, 10:49 PM IST
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం... టీ20 సిరీస్ కూడా రోహిత్ సేనదే...

సారాంశం

చివరి ఓవర్ దాకా ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో 8 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్... నికోలస్ పూరన్, రోవ్‌మెన్ పావెల్ పోరాటం వృథా...

భారత పర్యటనలో నాలుగు వరుస ఓటముల తర్వాత తొలి విజయాన్ని రుచి చూడాలన్న వెస్టిండీస్ ఆశలు నెరవేరలేదు. టీమిండియాతో జరిగిన రెండో టీ20లో చివరి ఓవర్ దాకా పోరాడిన విండీస్, 8 పరుగుల తేడాతో ఓడింది.ఆఖరి 2 ఓవర్లలో 29 పరుగులు కావాల్సిన దశలో భారత బౌలర్లు అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చి విజయాన్ని అందించారు. 
 
187 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన విండీస్‌, ఓపెనర్ కేల్ మేయర్స్ వికెట్ త్వరగా కోల్పోయింది. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన మేయర్స్, చాహాల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 

30 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్, రవి భిష్ణోయ్ వేసిన తొలి ఓవర్‌లో అవుట్ అయ్యాడు... 59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది విండీస్. ఈ శలో నికోలస్ పూరన్, రోవ్‌మెన్ పావెల్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు...

58 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ వెస్టిండీస్‌ని విజయం అంచుల దాకా తీసుకొచ్చారు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసిన నికోలస్ పూరన్, 19వ ఓవర్‌లో భువీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 

19వ ఓవర్‌లో పూరన్ వికెట్ తీయడంతో పాటు 4 పరుగులు మాత్రమే ఇచ్చిన భువనేశ్వర్ కుమార్, మ్యాచ్‌ని భారత్‌వైపు మార్చాడు. ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ మొదటి రెండు బంతుల్లో సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. అయితే ఆ తర్వాత రెండు బంతుల్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు రోవ్‌మెన్ పావెల్. ఆఖరి రెండు బంతుల్లో 11 పరుగులు కావాల్సిన దశలో హర్షల్ పటేల్, అద్భుతమైన లో ఫుల్ టాస్ వేసి కేవలం ఓ పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో భారత జట్టు విజయం ఖాయమైపోయింది. 

భువనేశ్వర్ కుమార్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోవ్‌మెన్ పావెల్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

 అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించారు...

ఇషాన్ కిషన్ 10 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి కాట్రెల్ బౌలింగ్‌లో మేయర్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

విండీస్ ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు....

59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 

41 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో 30వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 

రోహిత్ శర్మ 30 హాఫ్ సెంచరీలతో టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉంటే, విరాట్ కోహ్లీ అతని రికార్డును సమం చేశాడు...

వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీకి ఇది ఆరో హాఫ్ సెంచరీ. టీ20ల్లో విండీస్‌పై అత్యధిక అర్ధ శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ...

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 106 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు... రోస్టన్ ఛేజ్ 3 వికెట్లు తీసి టీమిండియాపై రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 

ఆ తర్వాత యంగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కి 35 బంతుల్లో 76 పరుగులు జోడించారు.

18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, ఆఖరి ఓవర్ మూడో బంతికి షెఫర్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... రిషబ్ పంత్ 28 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు