
శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది భారత జట్టు. రవీంద్ర జడేజా 82 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు...
అంతకుముందు ధనాధన్ బ్యాటింగ్‌తో లంక బౌలర్లకు చుక్కలు చూపించిన రిషబ్ పంత్ 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...
97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు చేసిన రిషబ్ పంత్, సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో ఆగిపోయాడు..
75 బంతుల్లో 50 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆ తర్వాత జెట్ స్పీడ్‌తో దూకుడు పెంచి, లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు... కేవలం 22 బంతుల్లో 46 పరుగులు చేసిన రిషబ్ పంత్, లక్మల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
రిషబ్ పంత్ స్వదేశంలో సెంచరీ మిస్ చేసుకోవడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు 92,92,91 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్... ఈసారి సెంచరీకి మరింత చేరువగా వచ్చి అవుట్ అయ్యాడు...
రిషబ్ పంత్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా తొలి రోజు ఆట ఆఖరి 10 ఓవర్లలో ఏకంగా 80 పరుగులు రాబట్టగలిగింది భారత జట్టు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్‌లో స్వీప్ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 49 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసి ఎంబుల్దెనియా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు... 80 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో మాజీ సారథి విరాట్ కోహ్లీతో కలిసి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు హనుమ విహారి...
టెస్టు కెరీర్‌లో 900+ ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరుపున టెస్టుల్లో అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్‌గా ఆరో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ...
టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ, టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు... ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే 8+ వేలు పైగా టెస్టు పరుగులు సాధించారు...
తన 100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో క్రికెటర్ విరాట్ కోహ్లీ. అంతకుముందు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఫీట్ సాధించాడు...76 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, యంగ్ స్పిన్నర్ ఎంబూల్దెనియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
ఆ తర్వాత కొద్దిసేపటికే 128 బంతుల్లో 5 ఫోర్లతో 58 పరుగులు చేసిన హనుమ విహారి, ఫెర్నాండో బౌలింగ్‌లో విశ్వకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు...
48 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో రిషబ్ పంత్ తన స్టైల్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ అందుకున్నాడు....
సౌతాఫ్రికాలో జరిగిన కేప్‌టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రిషబ్ పంత్‌కి ఇది వరుసగా రెండో 50+ స్కోరు. ఎంబూల్దెనియా వేసిన 76వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 22 పరుగులు రాబట్టాడు రిషబ్ పంత్... సెంచరీకి చేరువవుతున్న పంత్‌ని లక్మల్ క్లీన్ బౌల్డ్ చేశాడు...