రోహితా..? రహానేనా..? టీమిండియా టెస్టు సారథిపై తేల్చుకోలేకపోతున్న బీసీసీఐ..

By team teluguFirst Published Nov 11, 2021, 1:14 PM IST
Highlights

India Vs New Zealand: బయో బబుల్.. వర్క్ లోడ్.. అలసట కారణంగా  టీమిండియా టెస్టులకు రెగ్యూలర్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లి న్యూజిలాండ్ తో తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు.  ఈ స్థానంలో ఎవరిని నియమిస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

టీ20 ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శనతో సూపర్-12 స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టిన టీమిండియా.. మరో వారం రోజుల్లో న్యూజిలాండ్ తో మూడు టీ20లు,  రెండు టెస్టులు ఆడనున్నది. ఈ మేరకు ఇప్పటికే  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసఐ).. టీ20 జట్టును కూడా ప్రకటించింది.  టీ20 సారథిగా విరాట్ కోహ్లి తప్పుకోవడంతో రోహిత్ శర్మ ఆ స్థానాన్ని  భర్తీ చేస్తున్నాడు. అయితే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. టెస్టు జట్టును మాత్రం ప్రకటించలేదు. ఈనెల 25-29 మధ్య తొలి టెస్టు.. డిసెంబర్ 3-7 దాకా రెండో టెస్టు జరుగనున్నది.

పని భారం.. బయో బబుల్.. అలసట కారణంగా  టీమిండియా టెస్టులకు రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లి న్యూజిలాండ్ తో తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఈ స్థానంలో ఎవరిని నియమిస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. టెస్టులలో వైస్ కెప్టెన్ గా ఉన్న అజింక్యా రహానేను సారథిగా నియమించనున్నారా..? లేక టీ20 లకు సారథి గా ఉన్న రోహిత్ శర్మనే  తొలి టెస్టులో కూడా కెప్టెన్ గా కొనసాగించుతారా..? అన్నది ఇంకా సస్పెన్సే. దీనిపై బీసీసీఐ పెద్దలు డైలమాలో ఉన్నారు. అయితే ఫామ్ లో లేని రహానే కంటే రోహిత్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడమే అన్న నిర్ణయానికి బీసీసీఐ పెద్దలు వచ్చినట్టు సమాచారం. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా రోహిత్ వైపే మొగ్గు చూపుతున్నాడట. దీనిపై బీసీసీఐ నేడో.. రేపో తుది జట్టును ప్రకటించనున్నది. 

కాగా.. టీ20 ల మాదిరే కివీస్ తో టెస్టులకు కూడా టీమిండియా లోని పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నారని సమాచారం. గత ఆరునెలలుగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్ తో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు కూడా సెలెక్టర్లు రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ఇదే నిజమైతే టెస్టు జట్టులో కూడా కొన్ని కొత్త ముఖాలు కనిపించే అవకాశం ఉంది. టెస్టులలో కిపీర్ గా వృద్ధిమాన్ సాహా లేదంటే ఆంధ్ర ఆటగాడు కెఎస్ భరత్ చోటు దక్కించుకోవచ్చు. ముందే చెప్పినట్టు విరాట్ విశ్రాంతి కోరుకుంటుండగా..  ముంబై లో జరిగే రెండో టెస్టుకు అతడు జట్టుతో కలుస్తాడు. అప్పట్నుంచి అతడే కెప్టెన్ గా కొనసాగుతాడు. 

ఆటగాళ్లకు రెండు రోజుల విశ్రాంతి.. 

బయో బబుల్.. ఒత్తిడి సమస్యల కారణంగా బీసీసీఐ.. టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని భావిస్తున్నది. ప్రస్తుతం యూఏఈలో ఉన్న భారత క్రికెటర్లు.. త్వరలోనే భారత్ కు రానున్నారు. అయితే వచ్చిన తర్వాత వారికి రెండ్రోజుల పాటు  బ్రేక్ ఇవ్వనున్నారు.  నవంబర్ 17 న కివీస్ తో తొలి టీ20 (జైపూర్ లో) జరుగనుంది. టీమిండియా బయోబబుల్ లో కలిసే భారత ఆటగాళ్లు.. మరో మూడు నెలల పాటు బబుల్ లోనే  గడపాల్సి ఉంటుంది. డిసెంబర్ లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నది. 

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ గా టి. దిలీప్.. 

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. సహాయక సిబ్బంది విషయంలో తన మార్కు చూపిస్తున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (బెంగళూరు) లో ద్రావిడ్ తో పాటే కలిసి పనిచేసిన టి. దిలీప్ ను ఫీల్డింగ్ కోచ్ గా బీసీసీఐ నియమించింది. ఇక విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్ గా.. పరాస్ మంబ్రే బౌలింగ్ కోచ్ గా ఎంపికకానున్నారు. 

click me!