బిసిసిఐ కీలక నిర్ణయం... భారత క్రికెటర్ల కోసం ప్రత్యేక సంఘం

By Arun Kumar PFirst Published Jul 24, 2019, 2:07 PM IST
Highlights

భారత క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించే బిసిసిఐ చారిత్రక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ  క్రికెటర్లంతా కలిసి తమ సంక్షేమం కోసం ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకోడానికి అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.  

ఇప్పటివరకు మనం ఉద్యోగ, కార్మిక, పోలీస్ చివరకు ఐఎఎస్ అధికారుల సంఘాల గురించి విన్నాం. కానీ తాజాగా భారత దేశంలో క్రీడా సంఘాల గురించి ఎక్కువగా విన్న దాఖలాలు లేవు. అయితే మన దేశంలో ఎంతో క్రేజ్ కలిగిన అంతర్జాతీయ క్రికెటర్లతో ఓ సంఘం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఇన్నాళ్లు క్రికెటర్లంతా కలిసి ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకోడానికి అడ్డుచెప్పిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డే(బిసిసిఐ) తాజాగా అందుకు ఆమోదం తెలిపింది. 

బిసిసిఐ నూతన నియమావళి ప్రకారం మాజీ క్రికెటర్లు తమ సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం సంఘాన్ని ఏర్పాటు చేసుకోడానికి అనుమతించినట్లు బిసిసిఐ  తెలిపింది. బోర్డు నూతన రాజ్యాంగంలోని కంపెనీ చట్టం 2013 సెక్షన్ 8 ప్రకారం ఈ ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ఏర్పాటయింది. అయితే ఈ అసోసియేషన్ ఆరంభంలో బిసిసిఐ నిధులు సమకూర్చనుంది. కొంత కాలం తర్వాత ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తామని...ఈ సంక్షేమ సంఘమే స్వయంగా నిధుల సమీకరణ జరుపుకోవాల్సి వుంటుందని బిసిసిఐ తెలిపింది. 

విదేశాల్లో మాదిరిగా ఈ అసోసియేషన్ లో చేరడానికి ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న ఆటగాళ్లు అనర్హులు. కేవలం క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకుని మాజీలుగా మారిన వారికే ఇందులో సభ్యత్వం వుంటుంది. ఈ అసోసియేషన్ కు అనుబంధంగా ఎలాంటి సంఘాలు కానీ కొనసాగించడానికి వీల్లేదని...దీనికి కాకుండా మరే ఇతర సంఘానికి తాము అనుమతించబోమని బిసిసిఐ తెలిపింది.
 
భారత పురుష, మహిళా క్రికెట్ .జట్లకు ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్ల సంక్షేమం కోసం ఈ అసోసియేషన్ పనిచేయనుంది. ప్రస్తుతానికి టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, అజిత్ అగార్కర్, మాజీ మహిళా క్రికెటర్ శాంత రంగస్వామిని బిసిసిఐ డైరెక్టర్లుగా నియమించింది. ఐసిఏ(ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్) కు ఎన్నికలు జరిగి నూతన కార్యవర్గం ఏర్పాటయ్యే వరకు ఈ ముగ్గురే డైరెక్టర్లుగా కొనసాగనున్నారు. 
 

click me!