బీసీసీఐ పై డెక్కన్ ఛార్జర్స్ విజయం, విలువ 4800 కోట్లు

By Sreeharsha GopaganiFirst Published Jul 18, 2020, 9:41 AM IST
Highlights

2009 ఐపీఎల్‌ విజేతగా నిలిచిన డెక్కన్‌ ఛార్జర్స్‌.. సస్పెన్షన్‌కు ముందు ప్రాంఛైజీ యాజమాన్య హక్కులను (పూర్తి వాటాను) అమ్మేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. డెక్కన్‌ ఛార్జర్స్‌ను తీసుకునేందుకు కొన్ని కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినా.. బీసీసీఐ డెక్కన్‌ ఛార్జర్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

సుదీర్ఘ న్యాయపోరాటంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మాజీ ప్రాంఛైజీ డెక్కన్‌ ఛార్జర్స్‌కు (డిసిహెచ్‌ఎల్‌) ఊరట లభించింది. ఐపీఎల్‌ నిబంధనలు అతిక్రమించటం, ఆర్థిక నిలకడ లేమి కారణంగా డెక్కన్‌ ఛార్జర్స్‌ను బీసీసీఐ 2012లో సస్పెండ్‌ చేసింది. 

2009 ఐపీఎల్‌ విజేతగా నిలిచిన డెక్కన్‌ ఛార్జర్స్‌.. సస్పెన్షన్‌కు ముందు ప్రాంఛైజీ యాజమాన్య హక్కులను (పూర్తి వాటాను) అమ్మేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. డెక్కన్‌ ఛార్జర్స్‌ను తీసుకునేందుకు కొన్ని కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినా.. బీసీసీఐ డెక్కన్‌ ఛార్జర్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

అనంతరం వేసిన టెండర్లలో సన్‌గ్రూప్‌కు హైదరాబాద్‌ నగర ప్రాంఛైజీ హక్కులను అందించింది. బీసీసీఐ ఏకపక్ష నిర్ణయంపై డెక్కన్‌ ఛార్జర్స్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఈ సమస్య పరిష్కారానికి ఆర్బిట్రేటర్‌ను నియమించింది. 

ఏడేండ్ల పాటు బీసీసీఐ, డెక్కన్‌ ఛార్జర్స్‌ వాదనలను విన్న ఆర్బిట్రేటర్‌ డిసిహెచ్‌ఎల్‌కు రూ. 4800 కోట్ల చెల్లించాలని శుక్రవారం ఆదేశించింది. 2012లో ఆటగాళ్ల వేతనాలు, ఇతర బ్యాంకుల అప్పులు కలుపుకుని సుమారు రూ.4000 కోట్ల బకాయిలు ఉన్నాయని బీసీసీఐ నివేదించింది. 

కోర్టులో కేసు నడస్తుండగానే 2017లో డెక్కన్‌ ఛార్జర్స్‌ దివాళ ప్రక్రియ మొదలైంది. 2020 సెప్టెంబర్‌ లోగా డిసిహెచ్‌ఎల్‌కు రూ.4800 కోట్లు చెల్లించాలని సింగిల్‌ ఆర్బిట్రేటర్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సి.కె ఠక్కర్‌ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఆర్బిట్రేటర్‌ తీర్పు తుది కాపీ అందిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తరఫున లీగల్‌ కౌన్సిల్‌ పేర్కొన్నది.

click me!