మూడో టీ20లో పోరాడి గెలిచిన బంగ్లాదేశ్... టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు..

Published : Jul 13, 2023, 05:35 PM IST
మూడో టీ20లో పోరాడి గెలిచిన బంగ్లాదేశ్...  టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు..

సారాంశం

మూడో టీ20 మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న బంగ్లాదేశ్... 2-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు.. 

బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళా జట్టుకి తొలి ఓటమి ఎదురైంది. మొదటి రెండు టీ20 మ్యాచుల్లో విజయాలు అందుకున్న భారత మహిళా జట్టు, మూడో టీ20లో 4 వికెట్ల తేడాతో ఓడింది. రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 95 పరుగులకే పరిమితమైన హర్మన్‌ప్రీత్ కౌర్, ఆఖరి టీ20 మ్యాచ్‌లోనూ ఇదే నిర్ణయం తీసుకుంది..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధానా 2 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ కాగా షెఫాలీ వర్మ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా..

ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి మూడో వికెట్‌కి 45 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 26 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్, షోర్నా అక్తర్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యింది. 41 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఫహిమా ఖటున్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా పెవిలియన్ చేరింది..

వికెట్ కీపర్ యషికా భాటియా 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి రబేయా ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కాగా అమన్‌జోత్ కౌర్ 2 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. పూజా వస్త్రాకర్ 2, దీప్తి శర్మ 4, మిన్ను మనీ 1 పరుగులు చేసి అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది టీమిండియా..

103 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది బంగ్లాదేశ్ మహిళా జట్టు. శాంతి రాణి 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేయగా షమీమా సుల్తానా 46 బంతుల్లో 3 ఫోర్లతో 42 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. దిలారా అక్తర్ 7 పరుగులు చేసి స్టంపౌట్ కాగా 20 బంతుల్లో 14 పరుగులు చేసిన కెప్టెన్ నిగర్ సుల్తానా, దేవికా వైద్య బౌలింగ్‌లో యషికా భాటియాకి క్యాచ్ ఇచ్చి అవుటైంది.

షోర్నా అక్తర్ 2 పరుగులు, సుల్తానా ఖటున్ 12 పరుగులు చేసి అవుట్ కాగా రితూ మోనీ 7, నహీదా అక్తర్ 10 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్‌ని ముగించారు. ఈ సిరీస్‌లో 94 పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కగా, షెమీమా సుల్తానా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకుంది. ఇరుజట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్, జూలై 16న జరగనుంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !