సచిన్ టెండూల్కర్ 14 ఏండ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన బంగ్లా ప్లేయ‌ర్..

By Mahesh Rajamoni  |  First Published Dec 20, 2023, 5:50 PM IST

Soumya Sarkar breaks sachin tendulkar record: మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బంగ్లాదేశ్ క్రికెట‌ర్ సౌమ్య సర్కార్ బద్దలు కొట్టాడు. కీవీస్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో సౌమ్య సర్కార్ 151 బంతుల్లో 169 పరుగులు చేసి జట్టును గౌరవప్రదమైన స్కోరు 292 పరుగులకు చేర్చాడు.
 


Soumya Sarkar breaks sachin tendulkar record: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ సౌమ్య స‌ర్కారు దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ 14 ఏండ్ల రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. బంగ్లాదేశ్ వ‌ర్సెస్ న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్ లో భాగంగా బుధ‌వారం నెల్సన్ లోని సాక్స్టన్ ఓవల్ మైదానంలో న్యూజిలాండ్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ‌ధ్య రెండో వన్డే జ‌రిగింది. ఈ మ్యాచ్ లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 14 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ క్రికెట‌ర్ సౌమ్య సర్కార్ బద్దలు కొట్టాడు. కివీస్ పై 169 పరుగులు చేసి సచిన్ ను అధిగమించి న్యూజిలాండ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఉపఖండం బ్యాట్స్ మన్ గా నిలిచాడు.

అంతకుముందు, 2009లో క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 163 ​​పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ పేరిటే ఈ రికార్డు ఉంది. సౌమ్య‌ సర్కార్‌కు ముందు గత 14 ఏళ్లలో ఉపఖండంలోని మరే ఇతర బ్యాటర్ ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. సౌమ్య సర్కార్ 169 పరుగులతో రాణించడంతో రెండో వన్డేలో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన అనంతరం కీవీస్ జ‌ట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ సౌమ్య సర్కార్ 151 బంతుల్లో 169 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ (57 బంతుల్లో 45 పరుగులు) మిడిలార్డర్లో కీలక పాత్ర పోషించాడు. మిగ‌తా బ్యాట‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేదు. కీవీస్ బౌల‌ర్ల‌లో జాకబ్ డఫీ, విలియం ఒరోర్కేలు మూడేసీ వికెట్లు తీసుకున్నారు.

Latest Videos

292 పరుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన కీవీస్ జ‌ట్టు నాలుగు ఓవ‌ర్లు మిగిలివుండ‌గానే విజ‌యం సాధించింది. ఛేదనలో విల్ యంగ్ (94 బంతుల్లో 89 పరుగులు), హెన్రీ నికోల్స్ (99 బంతుల్లో 95 పరుగులు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. కివీస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర 33 బంతుల్లో 45 పరుగులతో రాణించాడు. కెప్టెన్ టామ్ లాథమ్ 32 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఆతిథ్య జట్టు కీవీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అద్భుత ప్రదర్శన చేసిన సౌమ్య సర్కార్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపిక‌య్యాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది.

click me!