
బంగ్లాదేశ్ యువ పేసర్ షోహిదుల్ ఇస్లాంపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలడంతో అతడిపై పది నెలల నిషేధం విధించింది. అతడిని అనర్హుడిగా ప్రకటించింది. పది నెలలవరకు అతడు ఏ విధమైన ఫార్మాట్ ఆడటానికి కూడా వీళ్లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే 28 నుంచి నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.
27 ఏండ్ల షోహిదుల్.. బంగ్లాదేశ్ తరఫున ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు. అంతేగాక ఇటీవల ఆ జట్టు పర్యటించిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనలలో జట్టు బంగ్లాదేశ్ సభ్యుడిగా ఎంపికయ్యాడు.
పలు పర్యటనలలో అతడిని జట్టులోకి ఎంపిక చేసినా అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. డోప్ టెస్టులో భాగంగా నిర్వహించిన పరీక్షలో షోహిదుల్ మూత్ర నమూనాలు సేకరించగా అందులో నిషేధిత పదార్థం క్లోమిఫెన్ ఉన్నట్టు తేలింది. దీంతో ఐసీసీ అతడిని విచారించింది.
డోపింగ్ నిరోదక కోడ్ ఆర్టికల్ 2.1 కోడ్ ను ఉల్లంఘించాడని షోహిదుల్ ఒప్పుకోవడంతో ఐసీసీ అతడిపై అనర్హత వేటు వేసింది. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. షోహిదుల్ పై విధించిన నిషేధం 2023 మార్చి 28 వరకు అమల్లో ఉంటుంది. అప్పటివరకు ఏ ఫార్మాట్ లోనూ అతడు ఆడటానికి అవకాశం లేదు.