
ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ రెండూ కూడా ఇంగ్లాండ్ దగ్గరే ఉన్నాయి. 2019లో న్యూజిలాండ్‌ని సూపర్ ఓవర్‌లో ఓడించి వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, 2022లో పాకిస్తాన్‌ని చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది. అయితే బంగ్లా టూర్‌లో ఇంగ్లాండ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది బంగ్లాదేశ్. వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో గెలిచిన ఇంగ్లాండ్‌ని వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓడించింది బంగ్లాదేశ్...
ఆఖరి వన్డేలో 50 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్, తొలి టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. తాజాగా ఢాకాలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ 4 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది...
రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, 20 ఓవర్లలో 117 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఫిలిప్ సాల్ట్ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయగా డేవిడ్ మలాన్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
మొయిన్ ఆలీ 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేయగా కెప్టెన్ జోస్ బట్లర్ 6 బంతుల్లో 4 పరుగులు చేసి హసన్ మహమూద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డంక్లెట్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేయగా సామ్ కుర్రాన్ 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేశాడు. క్రిస్ వోక్స్ 2 బంతులు ఆడి డకౌట్ కాగా క్రిస్ జోర్డాన్ 10 బంతులాడి 3 పరుగులే చేశాడు..
అతి పిన్న వయసులో ఇంగ్లాండ్ తరుపున టెస్టు, వన్డే, టీ20ల్లో ఆరంగ్రేటం చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రెహాన్ అహ్మద్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అదిల్ రషీద్ 1 పరుగు చేయగా జోఫ్రా ఆర్చర్ పరుగులేమీ చేయకుండానే గోల్డెన్ డకౌట్ అయ్యాడు...
118 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది బంగ్లాదేశ్. లిటన్ దాస్ 9, రోనీ తలూక్‌దార్ 9 పరుగులు చేసి అవుట్ కాగా తోహిద్ హృదయ్ 18 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు, మెహిదీ హసన్ మిరాజ్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులు చేశారు..
కెప్టెన్ షకీబ్ అల్ హసన్ డకౌట్ కాగా అఫిఫ్ హుస్సేన్ 2 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన నజ్ముల్ హుస్సేన్ షాంటో 47 బంతుల్లో 3 ఫోర్లతో 46 పరుగులు చేసి బంగ్లాకి విజయాన్ని అందించాడు... స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీసినా ఇంగ్లాండ్‌కి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.