
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి షాక్ ఇస్తూ... పిచ్ అన్యూహ్యంగా స్పిన్నర్లకు అద్భుతంగా సహకరించింది. ఫలితంగా వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియా, రెండు సెషన్లు కూడా ముగియకుండానే ఆలౌట్ అయ్యింది...
ఆ తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక కూడా టపాటాపా వికెట్లు కోల్పోవడంతో మొదటి రోజే 16 వికెట్లు పడ్డాయి. రెండో రోజు కూడా వికెట్ల పతనం అలాగే కొనసాగింది. శ్రీలంక కేవలం 5.5 ఓవర్లలోనే చివరి నాలుగు వికెట్లు కోల్పోయి 109 పరుగులకి ఆలౌట్ కాగా... ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది...
రెండో రోజు ఆఖర్లో రెండోసారి బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక ఓ వికెట్ కోల్పోగా... మూడో రోజు మిగిలిన 9 వికెట్లు కోల్పోవడానికి పెద్ద సమయమేమీ దక్కలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు, శ్రీలంకను 238 పరుగుల తేడాతో చిత్తు చేసి, సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది...
కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మకు ఇది తొలి టెస్టు సిరీస్ విజయం. అయితే భారత్ - శ్రీలంక మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు పిచ్‌కి ‘బిలో యావరేజ్’ రేటింగ్ ఇచ్చింది ఐసీసీ. ఐసీసీ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ‘పిచ్ మొదటి రోజు మొదటి సెషన్ నుంచే స్పిన్నర్లకు సహకరించడం మొదలెట్టింది. సెషన్లు గడిచేకొద్ది బౌలర్లకు ఎక్కువ సహకారం లభించడం మొదలెట్టింది. నా ఉద్దేశంతో బంతికి, బ్యాటుకి సమతూకమైన పిచ్ కాదు...’ అంటూ బెంగళూరు పిచ్‌పై రేటింగ్ ఇచ్చాడు...
బౌలర్లకు సహకరించే పిచ్‌ను రూపొందించినందుకు చిన్నస్వామి స్టేడియానికి ఓ డీ మెరిట్ పాయింట్‌ను ఇచ్చింది ఐసీసీ. ఏదైనా పిచ్‌కి, స్టేడియానికి మూడు నుంచి ఐదు డీ మెరిట్ పాయింట్లు దక్కితే, అది మ్యాచ్‌లు నిర్వహించడానికి సరైన పిచ్ కాదని, నాసిరకం పిచ్‌గా నిర్ణయిస్తారు. ఇలాంటి పిచ్‌లు అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించడానికి సరైనవి కావు.
ఐసీసీ నుంచి ఒక్కసారి డీ మెరిట్ పాయింట్ వస్తే, అది ఐదేళ్ల పాటు యాక్టీవ్‌గా ఉంటుంది. ఒకవేళ ఈ ఐదేళ్లలో ఐదు డీ మెరిట్ పాయింట్లు దక్కితే, దాన్ని అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించకుండా ఏడాది పాటు నిషేధం విధిస్తారు.
పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచులకు బ్యాటింగ్ పిచ్‌లను రూపొందిస్తోంది పీసీబీ. స్వదేశంలో ఆసీస్ చేతుల్లో ఓడిపోవాల్సి వస్తుందనే భయంతో పాక్ క్రికెట్ బోర్డు చేస్తున్న ఈ పని కారణంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఇక్కడ వికెట్ తీయాలంటే తారు రోడ్డుపై బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలంటూ ఓ మీమ్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడం విశేషం.
అటు భారత్ - శ్రీలంక మ్యాచులు మూడు - నాలుగు రోజుల్లో ముగిస్తే, పాకిస్తాన్- ఆస్ట్రేలియా మ్యాచులు ఐదు రోజుల పాటు సాగినా మ్యాచ్ రిజల్ట్ రావడం లేదు. దీంతో టెస్టు మజాను పూర్తిగా రుచి చూపించే మ్యాచులు చూసే అవకాశం దక్కడం లేదని వాపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.