బాబర్ ఆజమ్‌తో సహా టాపార్డర్ అట్టర్ ఫ్లాప్... పాక్ పతనాన్ని అడ్డుకున్న వరుణుడు..

By Chinthakindhi Ramu  |  First Published Sep 14, 2023, 7:59 PM IST

Asia Cup 2023: 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పాకిస్తాన్... బాబర్ ఆజమ్ మరో ఫెయిల్యూర్, 52 పరుగులు చేసి అవుటైన అబ్దుల్లా షెఫీక్.. 


ఆసియా కప్ 2023 టోర్నీని వరుణుడు వదిలేలా కనిపించడం లేదు. సూపర్ 4 రౌండ్‌లో భాగంగా పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి వర్షం వల్ల రెండోసారి అంతరాయం కలిగింది. వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైందీ మ్యాచ్. 45 ఓవర్ల పాటు మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, ఆట నిలిచే సమయానికి 27.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.

నేటి మ్యాచ్‌లో ఫకార్ జమాన్ ఆడడం లేదని, ఇమామ్ ఉల్ హక్‌తో మహ్మద్ హారీస్ ఓపెనింగ్ చేస్తాడని ప్రకటించింది పాక్ క్రికెట్ బోర్డు. అలాగే సౌద్ షకీల్ ఆడతాడని నిన్ననే టీమ్‌ని ప్రకటించింది. అయితే సౌద్ షకీల్ జ్వరంతో బాధపడుతుండడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. అలాగే ఇమామ్ వుల్ హక్, వెన్ను నొప్పితో బాధపడుతూ నేటి మ్యాచ్‌కి దూరమయ్యాడు.

Latest Videos

దీంతో ఫకార్ జమాన్ తుది జట్టులోకి తిరిగి రాగా ఇమామ్ ఉల్ హక్ ప్లేస్‌లో అబ్దుల్లా షఫీక్, ఆఘా సల్మాన్ ప్లేస్‌లో  మహ్మద్ హారీస్, హారీస్ రౌఫ్ ప్లేస్‌లో మహ్మద్ వసీం జూనియర్, నసీం షా ప్లేస్‌లో జమాన్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు..

11 బంతుల్లో 4 పరుగులు చేసిన ఫకార్ జమాన్, ప్రమోద్ మదుషాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. బాబర్ ఆజమ్, అబ్దుల్లా షెఫీక్ కలిసి రెండో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

35 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 69 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, పథిరాణా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

9 బంతుల్లో 3 పరుగులు చేసిన మహ్మద్ హారీస్, మతీశ పథిరాణా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్, మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పాకిస్తాన్..

నవాజ్ అవుట్ కాగానే వర్షం కురవడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. వన్డే మ్యాచ్‌లో గత 8 ఏళ్లలో పాకిస్తాన్‌పై ఒక్క విజయం అందుకోలేకపోయింది శ్రీలంక. నేటి మ్యాచ్‌లో ఆ అవకాశం దక్కేలా ఉన్నా, వర్షం కారణంగా రిజల్ట్ రావడం కష్టంగానే కనిపిస్తోంది..

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో ఫలితం రాకపోతే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న శ్రీలంక, ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. టాప్‌లో ఉన్న భారత జట్టు ఇప్పటికే 2023 ఆసియా కప్ ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే. 

click me!