ఎలాంటి టీమ్ ఎలా అయిపోయింది! ఆసీస్ చేతుల్లో చిత్తుగా ఓడిన వెస్టిండీస్... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో...

By Chinthakindhi RamuFirst Published Dec 11, 2022, 12:40 PM IST
Highlights

రెండో టెస్టులో 419 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన వెస్టిండీస్... 75 శాతం విజయాలతో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టాప్‌లోకి ఆస్ట్రేలియా... 

వీధ్వంకర బ్యాటర్లు, అరవీర భయంకర బౌలర్లతో క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్... పొట్టి ఫార్మాట్‌లోనూ సత్తా చాటింది. రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి టీమ్‌గా నిలిచిన వెస్టిండీస్.. ఇప్పుడు క్వాలిఫైయర్స్ ఆడాల్సిన దుస్థితికి చేరుకుంది. టెస్టుల్లో అయితే విండీస్ పరిస్థితి మరీ దారుణం. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత మరింత బలహీనంగా మారిన వెస్టిండీస్... ఆస్ట్రేలియా టూర్‌లో రెండు టెస్టుల్లోనూ ఘోర పరాజయాలను ఎదుర్కొంది...

తొలి టెస్టులో 164 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్, తాజాగా రెండో టెస్టులో 419 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 137 ఓవర్లు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 511 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. డేవిడ్ వార్నర్ 21, ఉస్మాన్ ఖవాజా 62 పరుగులు చేయగా మార్నస్ లబుషేన్ 163 పరుగులు చేశాడు...

కెప్టెన్ స్టీవ్ స్మిత్ డకౌట్ అయినా ట్రావిస్ హెడ్ 175 పరుగులు చేశాడు. కామెరూన్ గ్రీన్ 9, అలెక్స్ క్యారీ 41, నాజర్ 18, మిచెల్ స్టార్క్ 5 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 214 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టెనెనరైన్ చంద్రపాల్ 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. క్రెగ్ బ్రాత్‌వైట్ 19, షమర్ బ్రూక్స్ 8, బ్లాక్‌వుడ్ 3, డివాన్ థామన్ 19, అండర్సన్ ఫిలిప్ 43 పరుగులు చేశారు...

జాసన్ హోల్డర్ డకౌట్ కాగా జోషువా డి సిల్వ 23, రోస్టన్ ఛేజ్ 34, మిండ్లే 11 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగుల భారీ భాగస్వామ్యం దక్కినా ఫాలోఆన్ ఆడించడానికి ఇష్టపడలేదు ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లు బ్యాటింగ్ చేసిన విండీస్ 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 45 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 28 పరుగులు చేశాడు...

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మార్నస్ లబుషేన్ 31 పరుగులు, స్టీవ్ స్మిత్ 35 పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 496 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్... రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

క్రెగ్ బ్రాత్‌వైట్ 3, చంద్రపాల్ 17 పరుగులు చేయగా డివాన్ థామన్ 12, జాసన్ హోల్డర్ 11, జోషువా డి సిల్వ 15, రోస్టన్ ఛేజ్ 13, అల్జెరీ జోసఫ్ 3 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో షమర్ బ్రూక్స్, జరిమైన్ బ్లాక్‌వుడ్, మారిక్ మైండ్లే డకౌట్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్, మైకేల్ నేసర్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు తీయగా నాథన్ లియాన్‌కి ఓ వికెట్ దక్కింది.. ఈ విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసుకి మరింత చేరువైంది ఆస్ట్రేలియా. 

12 మ్యాచులు ఆడి 8 టెస్టుల్లో విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా 3 మ్యాచులను డ్రా చేసుకుంది. ఓ మ్యాచ్‌లో ఓడింది. ప్రస్తుతం 75 శాతం విజయాలతో ఉన్న ఆస్ట్రేలియా... వచ్చే ఏడాది ఇండియాతో ఆడే నాలుగు టెస్టుల ఫలితాన్ని బట్టి ఫైనల్ బెర్త్ డిసైడ్ చేసుకుంటుంది. 

click me!