ప్రపంచ ఛాంపియన్ల పరువు తీసిన ఆస్ట్రేలియా.. ఒక్క మ్యాచ్ కూడా గెలవని బట్లర్ గ్యాంగ్

By Srinivas MFirst Published Nov 22, 2022, 5:49 PM IST
Highlights

AUS vs ENG : రెండు వారాల క్రితం మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి ప్రపంచ  టీ20 ఛాంపియన్లుగా అవతరించిన  ఇంగ్లాండ్ జట్టుకు ఆస్ట్రేలియా కోలుకోలేని షాకిచ్చింది. 

టీ20 ప్రపంచకప్ ముగిసి ఇంకా పట్టుమని పదిహేను రోజులు కూడా కాలేదు.  ఈనెల 13న మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన ఫైనల్ లో ఇంగ్లాండ్ - పాకిస్తాన్ తలపడగా.. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లీష్ క్రికెట్ జట్టు బాబర్ ఆజమ్ అండ్ కో. ను ఓడించి  రెండో సారి ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు.  అయితే రెండు వారాలు కూడా గడవకముందే.. ఇంకా ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించకముందే  ప్రపంచ ఛాంపియన్లకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారీ షాకిచ్చింది. తమ దేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను  వైట్ వాష్ చేసింది.  మూడు వన్డేలలో ఇంగ్లాండ్ ను ఓడించి ప్రపంచ ఛాంపియన్ల పరువు తీసింది.  

ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రారంభమైన ఈ వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలను ఆస్ట్రేలియా నెగ్గిన విషయం తెలిసిందే. తాజాగా  ఇంగ్లాండ్  రెండు వారాల క్రితం వరల్డ్ కప్ నెగ్గిన  మెల్‌‌బోర్న్ లోనే మంగళవారం మూడో వన్డే జరిగింది.  

ఈ మ్యాచ్ లో తొలుత ఆస్ట్రేలియా.. 48 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  355 పరుగుల భారీ స్కోరు చేసింది.  అనంతరం వర్షం కారణంగా  ఇంగ్లాండ్ లక్ష్యాన్ని  డక్ వర్త్ లూయిస్  పద్ధతి ప్రకారం 364 పరుగులుగా నిర్ణయించారు.   కానీ ఆసీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్.. 31.4 ఓవర్లలో  142 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్..  221 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ 3-0తో ఆసీస్ వశమైంది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్ కు ట్రావిస్ హెడ్ (130 బంతుల్లో 152, 16 ఫోర్లు, 4 సిక్స్ లు), డేవిడ్ వార్నర్ (102 బంతుల్లో 106, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 38.1 ఓవర్లలో 269 పరుగులు జోడించారు.   ఆ తర్వాత మిచెల్ మార్ష్ (30) మెరుపులతో ఆసీస్ భారీ స్కోరు చేసింది.  ఆసీస్ బ్యాటర్ల ధాటికి ఇంగ్లాండ్ బౌలర్.. ఒలీ స్టోన్.. 10 ఓవర్లలో 85 పరుగులిచ్చుకున్నాడు. 

 

After nearly 2-0 whitewash by ENG Vs AUS before in T20 series
Revenge is always Sweet 🍭🍬
AUS’s biggest Men's ODI wins(by runs)✅
ENG’s biggest loss in a Men's ODI(by runs) - 221✅
Much awaited after early elimination from 🇦🇺 pic.twitter.com/fMRaprlfc9

— CRICKETEER UPDATES 🎉🎊🏏 (@786_naqi)

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఓపెనర్ జేసన్ రాయ్ (33) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. డేవిడ్ మలన్ (2), జేమ్స్ వీన్స్ (22), సామ్ బిల్లింగ్స్ (7), మోయిన్ అలీ (18), జోస్ బట్లర్ (1), క్రిస్ వోక్స్ (0), సామ్ కరన్ (12) లు ఇలా వచ్చి అలా వెళ్లారు.  ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్ జంపాకు  నాలుగు వికెట్లు దక్కగా.. సీన్ అబాట్, పాట్ కమిన్స్ లు తలా రెండు వికెట్లు తీశారు. 

click me!