INDvsNZ: విడువని వాన.. మూడో టీ20 టై.. టీమిండియాదే సిరీస్

By Srinivas MFirst Published Nov 22, 2022, 4:20 PM IST
Highlights

INDvsNZ T20I: అనుకున్నదే అయింది. మ్యాచ్ ప్రారంభం నుంచ అంతరాయం కలిగిస్తున్న వర్షం..  ఎంతకూ విడవకపపోవడంతో  మూడో టీ20 టై గా ముగిసింది. వర్షం కురిసే సమయానికి ఇరు జట్ల స్కోర్లు సమానంగా (డీఎల్ఎస్ ప్రకారం) ఉండటంతో మ్యాచ్ ను  అంపైర్లు నిలిపేశారు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా  1-0తో గెలుచుకుంది. 
 

భారత్-న్యూజిలాండ్ మధ్య  నేపియర్ వేదికగా  జరిగిన మూడో టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి  అంతరాయం కలిగిస్తున్న  వర్షం.. ఫలితానికి కూడా అడ్డుపడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా.. 9 ఓవర్లు ముగిసేసరికి  4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసే సమయానికి వర్షం  కురిసింది.  ఆటను పున: ప్రారంభించడానికి  అంపైర్లు  యత్నించినా వాన  తెరిపినివ్వకపోవడంతో  ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే ఇరు జట్ల స్కోర్లు సమానం (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) గా ఉండటంతో ఈ మ్యాచ్ టై గా ముగిసింది. 

కివీస్ నిర్దేశించిన  161 పరుగుల లక్ష్య ఛేదనలో  భారత్.. 4 వికెట్ల నష్టానికి  75 పరుగులు చేసింది.   టార్గెట్ లో భారత్ కు  పవర్ ప్లే లో  భారీ షాక్ లు తాకాయి.   ఓ  సిక్సర్, ఫోర్ తో ఊపుమీదున్న ఇషాన్ కిషన్ (10)  ను మిల్నే రెండో ఓవర్లోనే ఔట్ చేయగా సౌథీ  రిషభ్ పంత్ (11), శ్రేయాస్ అయ్యర్ లను వెనక్కి పంపాడు. 

గత మ్యాచ్ లో సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఈసారి 10 బంతుల్లో 1 ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 13 పరుగులే చేసి  ఇష్ సోధీ బౌలింగ్ లో  గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కానీ  హార్ధిక్ పాండ్యా.. 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో  30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  దీపక్ హుడా తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉండగా ఇష్ సోధి వేసిన 9వ ఓవర్ తర్వాత వాన కురిసింది.   అయితే అప్పటికీ భారత స్కోరు 75గా ఉంది.  

డక్ వర్త్ లూయిస్ ప్రకారం 9 ఓవర్లకు భారత్ చేయాల్సిన స్కోరు కూడా అంతేఉండటంతో   మ్యాచ్ టై గా మారింది. 74 పరుగులు చేస్తే భారత్ ఓడేది.. 76 చేసుంటే భారత్  గెలిచి ఉండేది. ఇక ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాగా రెండో టీ20లో సెంచరీ చేసిన  సూర్యకుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. 

అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్..  19.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్.. నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్.. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 4 వికెట్లు  పడగొట్టాడు.  హర్షల్ కు ఒక వికెట్ దక్కింది. 

 

Match abandoned here in Napier.

Teams level on DLS. clinch the series 1-0. pic.twitter.com/tRe0G2kMwP

— BCCI (@BCCI)

టీ20 సిరీస్ ముగియడంతో  ఈనెల 25 నుంచి   ఇరు జట్ల మధ్య  వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ కు భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరిస్తాడు. నవంబర్ 27న రెండో వన్డే, 30న మూడో వన్డేతో భారత న్యూజిలాండ్ పర్యటన ముగుస్తుంది. 

click me!