
నేపియర్ వేదికగా జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా.. 9 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా (18 బంతుల్లో 30 నాటౌట్), దీపక్ హుడా (9 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఇష్ సోధి వేసిన 9వ ఓవర్ తర్వాత వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపేశారు. మ్యాచ్ ముగిసేసమయానికి భారత్ ఇంకా 66 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది. టీమిండియా చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.
కాగా వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే మాత్రం ఫలితం ‘టై’గా మారనుంది. భారత్ ప్రస్తుతం 9 ఓవర్లకు 75 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం చూసుకుంటే.. చేయాల్సిన స్కోరుకు సమానంగా టీమిండియా స్కోరు (75) ఉంది. ఒకవేళ డీఎల్ఎస్ పద్ధతి ప్రకారంలో విజేతను నిర్ణయిస్తే అప్పుడు మ్యాచ్ టై గా మారుతుంది. అలా జరిగితే భారత్ నే సిరీస్ వరిస్తుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ లో భారత్ గెలిచింది. మూడో మ్యాచ్ ఇంకా ఫలితం తేలాల్సి ఉంది.
అంతకుముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ కు మరోసారి శుభారంభం దక్కలేదు. రెండో టీ20లో విఫలమైన ఓపెనర్ ఫిన్ అలెన్ (3) ఈసారి కూడా నిరాశపరిచాడు. అర్ష్‌దీప్ వేసిన తొలి ఓవర్లోనే అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన చాప్మన్ (12) కూడా ఆకట్టుకోలేదు. కానీ గ్లెన్ ఫిలిప్స్ తో జతకలిసిన కాన్వే రెచ్చిపోయాడు. ఇద్దరూ కలిసి ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. ఇద్దరే హాఫ్ సెంచరీలు సాధించారు కాన్వే - ఫిలిప్స్ కలిసి మూడో వికెట్ కు 86 పరుగులు జోడించారు.
సిరాజ్ వేసిన 16వ ఓవర్లో ఐదో బంతికి ఫిలిప్స్.. భారీ షాట్ ఆడబోయి భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కాన్వే.. అర్ష్దీప్ వేసిన 17వ ఓవర్లో ఇషాన్ కిషన్ కు చిక్కి వెనుదిరిగాడు. తన తర్వాత ఓవర్లో సిరాజ్.. నీషమ్ (0), సాంట్నర్ (1) ను ఔట్ చేయగా.. అర్ష్‌దీప్ తన చివరి ఓవర్లో తొలి బంతికి డారిల్ మిచెల్ (10), ఇష్ సోధి (0) లను ఔట్ చేశాడు. మూడో బంతికి ఆడమ్ మిల్నే (0) రనౌట్ అయ్యాడు. 16వ ఓవర్లో 146-3గా ఉన్న న్యూజిలాండ్ స్కోరు రెండు ఓవర్ల వ్యవధిలో 149-9గా మారింది. చివరి ఓవర్లో.. హర్షల్ పటేల్ సౌథీ (6) ని బౌల్డ్ చేసి కివీస్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. 19.4 ఓవర్లలో కివీస్.. 160 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్.. నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్.. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హర్షల్ కు ఒక వికెట్ దక్కింది.