ఏషియన్ గేమ్స్ సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం అందుకున్న ఆఫ్ఘనిస్తాన్... రేపు ఇండియా- ఆఫ్ఘాన్ మధ్య గోల్డ్ మెడల్ మ్యాచ్, బంగ్లాతో కాంస్య పతక పోరులో పాకిస్తాన్..
ఏషియన్ గేమ్స్ 2023 పురుషుల క్రికెట్ సెమీస్‌లో సంచలనం నమోదైంది. పాకిస్తాన్, పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లో పరాజయం పాలైంది. పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం అందుకున్న ఆఫ్ఘనిస్తాన్, భారత జట్టుతో కలిసి ఫైనల్ ఆడనుంది. టాస్ గెలిచిన ఆఫ్ఘాన్, బౌలింగ్ ఎంచుకుంది..
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 18 ఓవర్లలో 115 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓమెర్ యూసఫ్ 24, మిర్చా బెగ్ 4, రోహైల్ నజీర్ 10, హైదర్ ఆలీ 2, కెప్టెన్ ఖాసీం అక్రమ్ 9, కుష్‌దిల్ 8, ఆసిఫ్ ఆలీ 8, అరాఫత్ మిన్హాస్ 13, ఆమీర్ జమాల్ 14, ఉస్మాన్ ఖాదిర్ 5, సుఫియన్ ముకీం 1 పరుగు చేశారు..
ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీయగా కియాస్ అహ్మద్, జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. గుల్బాదీన్, కరీం జనత్‌లకు చెరో వికెట్ దక్కాయి. 116 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆఫ్ఘాన్..
సుదీకుల్లా అటల్ 5, మహ్మద్ షాజద్ 9 పరుగులు చేయగా షాహీదుల్లా కమాల్ డకౌట్ అయ్యాడు. అఫసర్ జజాయ్ 13, కరీం జనత్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన నూర్ ఆలీ జద్రాన్ పోరాడి అవుట్ అయ్యాడు. 19 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసిన కెప్టెన్ గుల్బాదిన్ నయిబ్, 6 పరుగులు చేసిన షరాఫుద్దీన్ ఆస్రఫ్ కలిసి ఆఫ్ఘాన్‌కి విజయం అందించారు..
సెమీ ఫైనల్‌లో ఓడిన బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య రేపు ఉదయం కాంస్య పతకం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఇండియా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య గోల్డ్ మెడల్ మ్యాచ్ జరుగుతుంది.