సెప్టెంబర్ 23 నుంచి ఏషియన్ గేమ్స్... 4 రోజుల ముందు నుంచే ఆ నాలుగు పోటీలు..

By Chinthakindhi RamuFirst Published Sep 19, 2023, 4:28 PM IST
Highlights

సెప్టెంబర్ 19 నుంచే క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బీచ్ వాలీబాల్ పోటీలు...  సెప్టెంబర్ 23న ఏషియన్ గేమ్స్ ఆరంభ వేడుకలు.. 

చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 23న ఏషియన్ గేమ్స్ 2023 ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 655 అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. సెప్టెంబర్ 23న ఏషియన్ గేమ్స్ మొదలవుతుంటే సెప్టెంబర్ 19 నుంచే క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బీచ్ వాలీబాల్ పోటీలు మొదలు అవుతాయి..

ఈసారి భారత్ నుంచి జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో పాటు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, షెట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ తదితరులు పాల్గొంటున్నారు. ఏషియన్ గేమ్స్‌లో మొట్టమొదటిసారి భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బరిలో దిగుతున్నాయి. 

భారత పురుషుల క్రికెట్ జట్టుకి యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతుంటే మహిళా క్రికెట్ జట్టుకి స్మృతి మంధాన సారథిగా వ్యవహరించనుంది. టీమిండియా మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ రెండు మ్యాచుల నిషేధం విధించింది. దీంతో భారత మహిళా క్రికెట్ జట్టు ఆడే మొదటి రెండు మ్యాచుల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండడం లేదు.

భారత క్రికెట్ జట్లు రెండూ కూడా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కి అర్హత సాధించాయి. కాబట్టి భారత జట్టు ఆడే క్వార్టర్ ఫైనల్ గెలిస్తేనే సెమీ ఫైనల్‌కి, సెమీస్ గెలిస్తేనే ఫైనల్ ఆడగలుగుతుంది. ఫైనల్‌లో ఓడిపోతే, కాంస్య పతకం కోసం పోటీలో నిలుస్తుంది.

భారత పురుషుల క్రికెట్ జట్టు, అక్టోబర్ 3న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అందులో గెలిస్తే అక్టోబర్ 6న జరిగే సెమీ ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య అక్టోబర్ 7న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సెమీస్‌లో ఓడిన జట్ల మధ్య అక్టోబర్ 7న కాంస్య పతకం కోసం మ్యాచ్ జరుగుతుంది. 

హాంగ్జౌ నగరంలోని 56 వేదికల్లో ఈ పోటీలు జరగబోతున్నాయి. మొత్తంగా 481 గోల్డ్ మెడల్స్‌ కోసం అథ్లెట్లు పోటీపడబోతున్నారు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు మానికా బత్రా, శరత్ కమల్‌తో పాటు చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కూడా ఏషియన్ గేమ్స్‌లో పోటీ పడబోతున్నాడు. భారత కాలమానం ప్రకారం పోటీలన్నీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పోటీలు ఉంటాయి. 

ఏషియన్ గేమ్స్‌ని సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యేక్ష ప్రసారం చూడొచ్చు. సోనీ లివ్ మొబైల్ యాప్‌లోనూ ఏషియన్ గేమ్స్ లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. సోనీ లివ్ మొబైల్ యాప్‌లో ప్రత్యేక్ష ప్రసారాలు చూడాలంటే నెలకు రూ.299 సబ్‌స్కిప్షన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 

click me!