
శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్యులను ఆలోచనలో పడేసింది. నిన్నా మొన్నటి వరకు ఆసియా కప్ ను శ్రీలంకలోనే నిర్వహిస్తామని తేదీలను కూడా వెల్లడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది ఏసీసీ. కానీ గడిచిన వారం రోజులుగా అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఏసీసీ సభ్యులలో ఆందోళన పెంచాయి. లంకలో నిరసనకారులు ఏకంగా అధ్యక్ష భవనాన్ని ముట్టడించి అక్కడ తిష్టవేసి కూర్చున్నారు.
తాజా పరిణామాలతో ఏసీసీ.. లంకలో ఆసియా కప్ నిర్వహణ కష్టమేనని భావిస్తున్నది.‘మీకేం కాదు.. మాదేశంలో ఆసియా కప్ ను నిశ్చింతగా నిర్వహించుకోవచ్చు. అందుకు సరిపడా సౌకర్యాలు మేము కల్పిస్తాం..’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు ఏసీసీని కోరుతున్నా.. ఆసియా కప్ ను అక్కడ నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధంగా లేరని సమాచారం.
లంకలో కాకుంటే బంగ్లాదేశ్ లో ఆసియా కప్ ను నిర్వహించేందుకు ఏసీసీ ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ విషయమై ఇదివరకే బంగ్లాక్రికెట్ బోర్డు (బీసీబీ) తో ఏసీసీ ప్రతినిధులు చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది. 2016లో ఆసియా కప్ ను బంగ్లాదేశ్ లోనే నిర్వహించారు.
ఆగస్టు 27 నుంచి ఈ టోర్నీని టీ20 ఫార్మాట్ లో ఆడించేందుకు గాను సన్నాహాలు మొదలెట్టిన ఏసీసీ.. లంకలో నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో పాటు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘేకు చెందిన ప్రైవేట్ భవనాన్ని కాల్చేశారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించడమే గాక గత మూడు రోజులుగా అక్కడే ఉండి పట్టు జారిపోకుండా పోరాడుతున్నారు.
కాగా ఆసియా కప్ ను తమ దేశంలోనే నిర్వహించాలని లంక బోర్డు.. ఏసీసీ ప్రతినిధులతో చర్చిస్తున్నది. ఇటీవలే తాము ఆస్ట్రేలియాతో టీ20 వన్డే, టెస్టు సిరీస్ ను ఏ ఆటంకం లేకుండా నిర్వహించామని, అంతేగాక ఇండియా-శ్రీలంక మహిళల క్రికెట్ సిరీస్ లనుకూడా విజయవంతంగా ముగించామని ఏసీసీ ప్రతినిధులకు విన్నవించుకుంటున్నారు. ఏసీసీని శాసిస్తున్న బీసీసీఐతో కూడా లంక క్రికెట్ బోర్డు ప్రతినిధులు టచ్ లోనే ఉన్నారు. తమ దేశం నుంచి ఆసియా కప్ నిర్వహణను మరోదేశానికి మళ్లించకూడదని ఏసీసీని వేడుకుంటున్నారు. లంక ఎంత చెప్పినా ఏసీసీ మాత్రం ఎటువంటి రిస్క్ తీసుకోవడానికీ ఇష్టపడటం లేదు.
ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహిస్తారా..? లేక బంగ్లాదేశ్ లో జరుపుతారా..? అన్నవిషయంపై ఈ నెలాఖరువరకు స్పష్టత రానుందని ఏసీసీ వర్గాలు తెలిపాయి.