India vs Sri Lanka: వరుసగా 14 వన్డేల తర్వాత తొలి పరాజయాన్ని అందుకున్న శ్రీలంక.. 41 పరుగుల తేడాలో లంకపై విజయం అందుకున్న భారత జట్టు..
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వరుసగా 14 వన్డేల్లో గెలిచి వరల్డ్ రికార్డు కొట్టిన లంకకు భారత జట్టు షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌పై 228 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత జట్టు, ఆతిథ్య శ్రీలంకతో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.. ఈ రెండు విజయాలతో ఆసియా కప్ 2023 ఫైనల్‌కి అర్హత సాధించింది టీమిండియా..
ఆధిక్యం చేతులు మారుతూ సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్‌లో దునిత్ వెల్లలాగే 5 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే 41.3 ఓవర్లలో 172 పరుగులకి ఆలౌట్ అయిన లంక... వరుసగా 13 వన్డేల తర్వాత తొలి పరాజయాన్ని అందుకుంది.
undefined
214 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంకకు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన కుసాల్ మెండిస్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే సూర్యకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
18 బంతుల్లో 2 పరుగులు చేసిన దిముత్ కరుణరత్నేని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక కలిసి నాలుగో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..
31 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసిన సదీర సమరవిక్రమ, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 35 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన చరిత్ అసలంక కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన లంక కెప్టెన్ దసున్ శనకని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. అయితే ధనంజయ డి సిల్వ, దునిత్ వెల్లలాగే కలిసి ఏడో వికెట్‌కి
75 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడిని విడదీసేందుకు టీమిండియా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు..
లంక విజయానికి 75 బంతుల్లో 52 పరుగులు కావాల్సిన దశలో జడేజా, ధనంజయ డి సిల్వని అవుట్ చేశాడు. 66 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వ, జడ్డూ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
14 బంతుల్లో 2 పరుగులు చేసిన మహీశ్ తీక్షణ, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగు చేసిన రజితని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పథిరాణా కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ వికెట్‌తో వన్డేల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్న కుల్దీప్ యాదవ్, 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. 5 వికెట్లు తీసిన యంగ్ బౌలర్ దునిత్ వెల్లలాగే 46 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, 49.1 ఓవర్లలో 213 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 53, కెఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.