లంక స్పిన్నర్ల ముందు తేలిపోయిన భారత బ్యాటర్లు... వర్షం రాకతో ఆగిన ఆట..

By Chinthakindhi Ramu  |  First Published Sep 12, 2023, 6:26 PM IST

India vs Pakistan: హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ, 39 పరుగులు చేసిన కెఎల్ రాహుల్.. టాపార్డర్‌ని అవుట్ చేసిన దునిత్ వెల్లలాగే, లోయర్ ఆర్డర్‌ని పెవిలియన్ చేర్చిన చరిత్ అసలంక.. 


ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బౌలర్లను ఆటాడుకున్న భారత బ్యాటర్లు, శ్రీలంక స్పిన్ మంత్రానికి తేలిపోయారు. 20 ఏళ్ల యంగ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లు తీసి, టీమిండియా టాపార్డర్‌ని కకావికలం చేశాడు. టాపార్డర్‌ని వెల్లలాగే అవుట్ చేస్తే, లోయర్ ఆర్డర్‌ని మరో స్పిన్నర్ చరిత్ అసలంక పెవిలియన్ చేర్చాడు. ఈ ఇద్దరి దెబ్బకు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 47 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి  197 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కురవడంతో ఆటకు అంతరాయం కలిగింది. 

11 ఓవర్లు ముగిసే సమయానికి 80/0 పరుగులతో భారీ స్కోరు చేసేలా కనిపించింది భారత జట్టు. అయితే దునిత్ వెల్లలాగే బౌలింగ్‌కి రాగానే సీన్ పూర్తిగా మారిపోయింది. 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని దునిత్ వెల్లలాగే క్లీన్ బౌల్డ్ చేశాడు..

Latest Videos

undefined

12 బంతుల్లో 3 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా దునిత్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ, వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని కూడా పూర్తి చేసుకున్నాడు..

48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన రోహిత్ శర్మను ఓ సూపర్ బంతితో బోల్తా కొట్టించాడు దునిత్ వెల్లలాగే. 11 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయి 91/3 స్థితికి చేరుకుంది భారత జట్టు..

కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కలిసి నాలుగో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 44 బంతుల్లో 2 ఫోర్లతో 39 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

61 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, అసలంక బౌలింగ్‌లో దునిత్ వెల్లలాగేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

18 బంతులాడి 5 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, దునిత్ వెల్లలాగే వేసిన 10వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న శ్రీలంకకు అనుకూలంగా ఫలితం దక్కింది.

19 బంతులు ఆడి 4 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, చరిత్ అసలంక బౌలింగ్‌లో కుసాల్ మెండిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..  178 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 12 బంతుల్లో 5 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా, అసలంక బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి కుల్దీప్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు..

సిరాజ్, అక్షర్ పటేల్ కలిసి దాదాపు 5 ఓవర్లు బ్యాటింగ్ చేసి 11 పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ 11, సిరాజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

10 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 40 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన దునిత్ వెల్లలాగే, కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. 9 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన చరిత్ అసలంక కూడా వన్డేల్లో బెస్ట్ బౌలింగ్ పర్ఫామెన్స్ నమోదు చేశాడు. ఆసియా కప్ చరిత్రలో స్పిన్నర్లు ఒకే వన్డేలో 9 అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. 

click me!