
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు టీమిండియా, నేపాల్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నేటి మ్యాచ్‌లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ దక్కడంతో నేటి మ్యాచ్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కోసమే తొలుత బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది..
మొట్టమొదటిసారి ఆసియా కప్‌కి అర్హత సాధించిన నేపాల్, టీమిండియాతో తలబడబోతుండడం కూడా ఇదే మొదటిసారి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నేపాల్ 238 పరుగుల తేడాతో ఓడింది. నేటి మ్యాచ్‌లో నేపాల్‌పై టీమిండియా గెలిచే తేడా, గ్రూప్ స్టేజీ టాపర్‌ని డిసైడ్ చేస్తుంది. ఇండియా -పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది.
మొదటి మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. అయితే ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత జట్టు 266 పరుగుల స్కోరు చేయగలిగింది..
పాక్‌తో మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే అవుటైన భారత దిగ్గజ బ్యాటర్లు అందరూ నేటి మ్యాచ్‌లో సెంచరీలు బాదేసి... తమ ఫామ్‌ని నిరూపించుకునే అవకాశం ఉంది. శుబ్‌మన్ గిల్ నేటి మ్యాచ్‌లో భారీ సెంచరీ చేస్తే, ఐసీసీ నెం.1 వన్డే ర్యాంక్‌లో ఉన్న బాబర్ ఆజమ్‌కి మరింత చేరువవుతాడు..
నేటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఆడడం లేదు. పాక్‌తో మ్యాచ్ తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా జస్ప్రిత్ బుమ్రా స్వదేశానికి వెళ్లాడు. ఆయన భార్య సంజన గణేశన్, మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నేటి మ్యాచ్‌లో నేపాల్ ఎలాంటి సంచలనం క్రియేట్ చేయకపోతే, సెప్టెంబర్ 10న పాకిస్తాన్‌తో సూపర్ 4 రౌండ్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా.. ఆ మ్యాచ్ సమయానికి జస్ప్రిత్ బుమ్రా తిరిగి జట్టుతో కలవబోతున్నాడు.
జస్ప్రిత్ బుమ్రా ప్లేస్‌లో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చాడు. జూన్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత మహ్మద్ షమీ, క్రికెట్ మ్యాచ్ ఆడబోతుండడం ఇదే తొలిసారి. నేటి మ్యాచ్‌లో నేపాల్ జట్టు కూడా ఒకే ఒక్క మార్పుతో బరిలో దిగుతోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన ఆరీష్ షేక్ ప్లేస్‌లో భీం శక్తి తుది జట్టులోకి వచ్చాడు.
నేపాల్ జట్టు: కుశాల్ బుర్టెల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పాడెల్ (కెప్టెన్), భీం శక్తి, సోంపాల్ కమి, గుల్షన్ జా, దీపేంద్ర సింగ్ ఆరీ, కుశాల్ మల్ల, సందీప్ లామిచానే, కరణ్ కేసీ, లలిత్ రాజభన్సీ
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్