యాషెస్ ప్రారంభానికి ముందే తొలి టెస్టు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. బజ్‌బాల్‌కు ఇది పీక్స్..

Published : Jun 15, 2023, 12:57 PM IST
యాషెస్ ప్రారంభానికి ముందే తొలి టెస్టు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. బజ్‌బాల్‌కు ఇది పీక్స్..

సారాంశం

Ashes 2023:  ఏ జట్టు అయినా టెస్టు మ్యాచ్ ప్రారంభంలో టాస్ పడ్డాక తమ తుది జట్టును అనౌన్స్ చేస్తుంది. కానీ గత కొంతకాలంగా ‘బజ్ బాల్’ మూడ్ లో ఉన్న  ఇంగ్లాండ్ దానిని పీక్స్‌కు తీసుకెళ్లింది.

డబ్ల్యూటీసీ  ఫైనల్ ముగిసిన తర్వాత  అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానులను అలరించేందుకు  మరో ప్రతిష్టాత్మక సిరీస్ మొదలుకానుంది.   రేపట్నుంచి (జూన్ 16)  ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియాల మధ్య   బర్మింగ్‌హోమ్ వేదికగా తొలి టెస్టు మొదలుకానుంది. అయితే ఏ జట్టు అయినా టెస్టు మ్యాచ్ ప్రారంభంలో టాస్ పడ్డాక తమ తుది జట్టును అనౌన్స్ చేస్తుంది. కానీ గత కొంతకాలంగా ‘బజ్ బాల్’ మూడ్ లో ఉన్న  ఇంగ్లాండ్ దానిని పీక్స్‌కు తీసుకెళ్లింది.  తొలి టెస్టు ప్రారంభానికి ఏకంగా రెండు రోజుల ముందే తుది జట్టును ప్రకటించింది. 

ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం రాత్రి  ట్విటర్  వేదికగా బర్మింగ్‌‌హామ్ టెస్టులో ఆడబోయే తమ తుది జట్టు ఇదేనని  ట్వీట్ చేసింది.   బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఈ జట్టులో ఐర్లాండ్  తో ఒక్క మ్యాచ్ కు దూరమైన స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ తిరిగొచ్చారు. 

2021లో టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన మోయిన్ అలీ.. ఈ టెస్టుతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.  పేస్ విభాగంలో వెటరన్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్, రాబిన్సన్  లు ఇంగ్లాండ్ పని పట్టనున్నారు.

ఇక బ్యాటింగ్ విషయానికొస్తే బెన్ డకెట్, జాక్ క్రాలే లు ఓపెనర్లు కాగా వన్ డౌన్ లో ఓలీ పోప్ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో జో రూట్ రానుండగా ఐదో స్థానంలో ఇంగ్లాండ్ సంచలనం హ్యారీ బ్రూక్  వస్తాడు. ఆరో స్థానంలో  కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆడతాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా జానీ బెయిర్ స్టో  ఏడో స్థానంలో ఉన్నాడు.  

గాయం నుంచి కోలుకున్న మార్క్ వుడ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. వుడ్ తో పాటు క్రిస్ వోక్స్,  మాథ్యూ పాట్స్, కొత్త కుర్రాడు జోష్ టంగ్ లు బెంచ్ కే పరిమితం కానున్నారు.  

యాషెస్‌తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్  తుది జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో, జో రూట్, జేమ్స్ అండర్సన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్ 

యాషెస్ సిరీస్ షెడ్యూల్ : 

మొదటి టెస్టు : జూన్ 16 - 20 - ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్) 
రెండో టెస్టు : జూన్ 28 -  జులై 2 - లార్డ్స్ (లండన్) 
మూడో టెస్టు : జులై 6 - 10  - హెడింగ్లీ (లీడ్స్) 
నాలుగో టెస్టు : జులై 19 - 23 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్) 
ఐదో టెస్టు : జులై 27 - 31  - కియా ఓవల్ (లండన్) 

గతేడాది  (2021-22) ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ ను  ఆస్ట్రేలియా 4-0 తో గెలుచుకుంది. ఈ సిరీస్ తర్వాత  రూట్.. విండీస్ లో కూడా టెస్టు సిరీస్ ఓడిపోయి  కెప్టెన్సీ పోగొట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత  ఇంగ్లాండ్  టెస్టు సారథ్య బాధ్యతలు తీసుకున్న బెన్ స్టోక్స్..  ఆ జట్టు రాత మార్చాడు. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్  తో కలిసి అద్భుతాలు చేస్తున్నాడు. గతేడాది జూన్ నుంచి  ఈ ఇద్దరి కలయికలో ఇంగ్లాండ్ 13 టెస్టులు ఆడితే ఏకంగా  11 గెలిచింది.  అయితే  ఈ ద్వయానికి అసలైన సవాల్  యాషెస్‌తో మొదలుకానుంది. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?