Asia Cup: కోహ్లీ క్లాస్.. సూర్య భాయ్ మాస్.. హాంకాంగ్ ముంగిట భారీ లక్ష్యం

By Srinivas MFirst Published Aug 31, 2022, 9:14 PM IST
Highlights

Asia Cup 2022: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ల దూకుడైన ఆటతో హాంకాంగ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. 

పసికూన హాంకాంగ్ పై బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా కసితీరా బాదింది. ఇండియా టాపార్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 59 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు)  తో పాటు చివర్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 68 నాటౌట్, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) లు  క్లాస్, మాస్ ఆటతో ప్రేక్షకులను అలరించారు. తొలుత భారత బ్యాటర్లను కాస్త కట్టడి చేసిన హాంకాంగ్ సూర్య రాకతో పరిస్థితి మారిపోయింది. కోహ్లీ, సూర్యలు మూడో వికెట్ కు 42 బంతుల్లోనే 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరి దూకుడుతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో చాలా కాలం తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. టీ20లలో కోహ్లీకి ఇది 31వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే  ఆరంభించింది. తొలి ఓవర్లో 5 పరుగులే రాగా రెండో ఓవర్లో ఒకటే పరుగు వచ్చింది. దీంతో రోహిత్ శర్మ (13 బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్సర్) గేర్ మార్చాడు. హరూన్ అర్షద్ వేసిన మూడో ఓవర్లో 6,4 కొట్టాడు. కెఎల్ రాహుల్ (39 బంతుల్లో 36, 2 సిక్సర్లు) కూడా అదే ఓవర్లో 6 తో లైన్ లోకి వచ్చాడు. 

కానీ అయుష్ శుక్లా వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్ కొట్టిన రోహిత్.. ఐదో బంతికి మిడాన్ వద్ద ఉన్న  ఐజజ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేటప్పటికీ ఇండియా స్కోరు 1 వికెట్ నష్టానికి 39 పరుగులు. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ.. రాహుల్ తో జతకలిసినా స్కోరు బోర్డు వేగం పెరగలేదు. ఇద్దరూ క్రీజులో కుదురుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 56 పరుగులు జోడించారు. పది ఓవర్లకు భారత స్కోరు వికెట్ నష్టానికి 70 పరుగులు మాత్రమే..నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్న ఈ జోడీని మహ్మద్ ఘజన్ఫర్ విడదీశాడు. అతడు వేసిన 13వ ఓవర్లో రాహుల్.. వికెట్ కీపర్ఖ మెక్‌కెచినికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్  స్కోరు వేగాన్ని అమాంతం పెంచాడు. యాసిమ్ ముర్తజా వేసిన 14వ ఓవర్లో  వరుసగా రెండు ఫోర్లు బాదిన సూర్య భాయ్.. అయుష్ శుక్లా వేసిన 15వ ఓవర్లో కూడా ఫోర్ కొట్టాడు. సూర్య వచ్చాక కోహ్లీ కూడా రెచ్చిపోయాడు. ఐజజ్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో కోహ్లీ సిక్సర్ బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఆ ఓవర్లో భారత్ కు 20 పరుగులొచ్చాయి. కానీ తర్వాత ఓవర్ వేసిన ఎషాన్ ఖాన్ బౌలింగ్ లో 4 పరుగులే వచ్చాయి. అయితే అయుష్ శుక్లా వేసిన 18వ ఓవర్లో సూర్య..  రెండు ఫోర్లతో పాటు సిక్సర్ కొట్టాడు. 

19వ ఓవర్ వేసిన ఎషాన్ ఖాన్ బౌలింగ్ లో సిక్సర్  బాదిన కోహ్లీ.. ఐదో బంతికి లాంగాఫ్ వైపుగా రెండు పరుగులు తీసి టీ20లలో 31వ హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో సూర్య..  సిక్సర్లతో చెలరేగాడు. హరూన్ అర్షద్ వేసిన ఆ ఓవర్లో సూర్య.. నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో అతడు 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఈ మ్యాచ్ లో హాంకాంగ్ గెలవాలంటే 20 ఓవర్లలో 193 పరుగులు చేయాలి. 

click me!