Asia Cup: పసికూనతో ప్రాక్టీస్.. అగ్రస్థానం కోసం టీమిండియా తహతహ.. టాస్ నెగ్గిన హాంకాంగ్

By Srinivas MFirst Published Aug 31, 2022, 7:08 PM IST
Highlights

Asia Cup 2022: మూడు రోజుల క్రితం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఓడించిన భారత జట్టు ఇప్పుడు పసికూన హాంకాంగ్ పని పట్టడానికి సిద్ధమైంది. 
 

ఆసియా కప్ - 2022లో భాగంగా పాకిస్తాన్ తో మ్యాచ్ లో విజయం సాధించి బోణీ కొట్టిన టీమిండియా.. హాంకాంగ్‌కు చుక్కలు చూపేందుకు సిద్ధమైంది. గ్రూప్-ఏలో క్వాలిఫయర్ గా  ఎంట్రీ ఇచ్చిన హాంకాంగ్ తో గెలిచి అగ్రస్థానంలో సూపర్-4కు అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తున్నది.  ఒకరకంగా భారత్ కు ఇది ప్రాక్టీస్ మ్యాచ్ వంటిదే. ఈ మేరకు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో హాంకాంగ్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ కు రానుంది.  

ఈ మ్యాచ్ లో భారత్ జట్టులో ఒక మార్పు జరిగింది.  టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చింది. అతడి స్థానంలో రిషభ్ పంత్ తుది జట్టులోకి వచ్చాడు. హాంకాంగ్ తాము గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నది.

పాకిస్తాన్ తో పోరులో విఫలమైన కెఎల్ రాహుల్ తో పాటు ఫామ్ కోసం తహతహలాడుతూ పాక్ తో మ్యాచ్ లో టచ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీలకు ఇది మంచి ప్రాక్టీస్ కానున్నది.  ఈ ఇద్దరితో పాటు గత మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ దీ అదే  పరిస్థితి. దీంతో వీరంతా   తర్వాత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం హాంకాంగ్ తో మ్యాచ్  ఎంతో ఉపకరించనుంది. బౌలింగ్ లో  భారత్ కు బెంగలేదు.  వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కు తోడుగా యువ సీమర్లు అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్ లు రాణిస్తున్నారు. రిషభ్ పంత్ జట్టుతో చేరడంతో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. 

అయితే టీ20లలో ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. తమదైన రోజున అనామక జట్టు కూడా  పెద్ద జట్లకు షాకివ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఇదే హాంకాంగ్.. 20 ఆసియా కప్ లో భాగంగా వన్డే ఫార్మాట్ లో జరిగిన పోరులో భారత్ ను వణికించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో హాంకాంగ్.. 259 పరుగులకే పరిమితమైనా ఒకదశలో గెలిచే స్థితిలో ఉంది. ఇప్పుడూ అదే ప్రదర్శనను రిపీట్ చేసేందుకు హాంకాంగ్ ఉవ్విళ్లూరుతున్నది. 

ఇరు జట్ల మధ్య ఇదే తొలి టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.  ఈ రెండు జట్ల మధ్య రెండు వన్డేలు జరిగాయి. రెండింటిలో భారత్ దే విజయం.  

తుది జట్లు : 

ఇండియా :  రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీస్ సింగ్ 

హాంకాంగ్: నిజకత్ ఖాన్ (కెప్టెన్), ముర్తజా, బాబర్ హయత్, కించిత్ షా, అల్జజ్ ఖాన్,  స్కాట్ మెక్‌కెచ్‌ని, జీషన్ అలీ, హరూన్ అర్షద్, ఇషాన్ ఖాన్, అయుష్ శుక్లా, మహ్మద్ ఘజన్‌ఫర్ 

click me!