టీమిండియాకి మరో ఓటమి... ఆసియా కప్ 2022 ఫైనల్ రేసు నుంచి అవుట్...

By Chinthakindhi RamuFirst Published Sep 6, 2022, 11:19 PM IST
Highlights

6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న శ్రీలంక... వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న టీమిండియా... 

ఆసియా కప్ 2022 టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు, ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. సూపర్ 4 రౌండ్‌లో పాక్‌తో మ్యాచ్ పరాజయం తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ భారత జట్టుకి పరాజయమై ఎదురైంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత జట్టు, ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది...

174 పరుగుల లక్ష్యఛేదనలో లంకకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు. పథుమ్ నిశ్శంక 37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు, కుశాల్ మెండీన్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి...తొలి వికెట్‌కి 97 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. 

నిశ్శంకని అవుట్ చేసిన యజ్వేంద్ర చాహాల్, చరిత్ అసలంకని డకౌట్ చేశాడు. ఆ తర్వాత దనుష్క గుణతిలక, అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికి నిశ్శంక పెవిలియన్ చేరాడు. 13 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోయింది శ్రీలంక...

అయితే చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో భనుక రాజపక్ష, ధసున్ శనక కలిసి మ్యాచ్‌ని ముగించారు. ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు కావాల్సి రాగా మొదటి నాలుగు బంతుల్లో 5 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి 2 పరుగులు తీసిన శనక, లంకకి 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందించాడు.  రాజపక్ష 17 బంతుల్లో 2 సిక్సర్లతో 25 పరుగులు చేయగా, భనక 18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  భారత జట్టు, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగుల స్కోరు చేయగలిగింది. టాపార్డర్‌లో కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో టీమిండియాకి మంచి స్కోరు అందించగలిగారు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత జట్టుకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. గాయం తర్వాత పరుగులు రాబట్టడానికి ఇబ్బంది పడుతున్న కెఎల్ రాహుల్‌ని మహీశ్ తీక్షణ, ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వగానే డీఆర్‌ఎస్ తీసుకున్నాడు కెఎల్ రాహుల్. అయితే టీవీ రిప్లైలో అంపైర్స్ కాల్‌గా రావడంతో 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు.  

వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ... దిల్షాన్ ముదుశంక బౌలింగ్‌లో మొదటి మూడు బంతుల్లో పరుగులు చేయలేకపోయాడు... నాలుగో బంతికి అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు దిల్షాన్ మదుశంక. దీంతో 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.

13  పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును ఆదుకున్నాడు రోహిత్ శర్మ. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మూడో వికెట్‌కి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ, 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి కరుణరత్నే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.. 

రోహిత్ శర్మ అవుటైన కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్ వికెట్ కోల్పోయింది భారత జట్టు. 29 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన సూర్యకుమార్, శనక బౌలింగ్‌లో తీక్షణకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... హార్ధిక్ పాండ్యా 13 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి శనక బౌలింగ్‌లో నిశ్శంకకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత రెండో బంతికే దీపక్ హుడా భారీ షాట్‌కి ప్రయత్నించి దిల్షాన్‌కి క్యాచ్ ఇచ్చాడు. అయితే టీవీ రిప్లైలో అది నో బాల్‌గా తేలడంతో బతికిపోయిన  హుడా,ఈ అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. 4 బంతుల్లో 3 పరుగులు చేసిన దీపక్ హుడాని క్లీన్ బౌల్డ్ చేసిన దిల్షాన్ మదుశనక, ఆ తర్వాత రెండో బంతికే రిషబ్ పంత్‌ని అవుట్ చేశాడు...

13 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన రిషబ్ పంత్, నిశ్శంకకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖరి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్‌‌ని కరుణరత్నే డకౌట్ చేశాడు. ఐదో బంతికి సిక్సర్ బాదిన రవిచంద్రన్ అశ్విన్, ఆఖరి బంతికి 2 పరుగులు తీశాడు. 7 బంతుల్లో 15 పరుగులు చేసిన అశ్విన్, ఆఖరి బంతికి హసరంగ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయాడు. 

click me!