Asia Cup: ఆసియా కప్ లంకదే.. ఫైనల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్..

By Srinivas MFirst Published Sep 11, 2022, 11:32 PM IST
Highlights

Asia Cup 2022: అంచనాలను తలకిందులు చేస్తూ ఆసియా కప్-2022 ను  శ్రీలంక  గెలుచుకుంది.  పాకిస్తాన్ తో ముగిసిన ఫైనల్ లో  లంకేయులు.. 23 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇది లంకకు ఆరో ఆసియా కప్. 

ఆసియా కప్-2022లో అంచనాలే లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. దుబాయ్ వేదికగా ముగిసిన  పాకిస్తాన్-శ్రీలంక  ఫైనల్  లో లంక.. పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పాక్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని  నిలిపింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది లంక యువ పేపర్ ప్రమోద్ మదుషాన్ 4 వికెట్లతో చెలరేగగా..స్పిన్నర్ వనిందు హసరంగ  3 వికెట్లతో పాకిస్తాన్ నడ్డి విరిచాడు. ఈ విజయంతో  శ్రీలంక.. ఆరో ఆసియా కప్ గెలుచుకుంది.  భారత్.. ఏడు ట్రోఫీలతో అందరికంటే ముందంజలో ఉంది. టోర్నీ ఆసాంతం రాణించిన పాక్.. చివరిదైన కీలకపోరులో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ తడబడి  అపజయాన్ని  చేజేతులా కొనితెచ్చుకుంది. 

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కు  ఈ టోర్నీలో ఎప్పటిలాగే శుభారంభం దక్కలేదు.  పేలవ ఫామ్ తో సతమతమవుతున్న  పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (5)మరోసారి నిరాశపరిచాడు. బాబర్ న ఔట్ చేసేందుకు శ్రీలంక  భారీ వ్యూహం పన్నింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన ప్రమోద్ మధుశంక.. ఆ ఓవర్లో రెండో బంతిని లెగ్ సైడ్ దిశగావిసిరాడు. అయితే షాట్ ఫైన్ లెగ్ వద్ద  అప్పటికే ఫీల్డర్ ను ఉంచిన లంకకు ఆజమ్ వికెట్ దక్కింది. 

బాబర్ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన ఫకర్ జమాన్ (0) ఆడిన తొలి బంతికే డకౌటయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్ (31 బంతుల్లో 32, 2 ఫోర్లు, 1 సిక్సర్)  తో కలిసి ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (49 బంతుల్లో 55, 4 ఫోర్లు,1 సిక్సర్)  మూడో వికెట్ కు  71 పరుగులు జోడించారు.   ఈ ఇద్దరూ కలిసి క్రీజులో కుదురుకుంటున్నతరుణంలో  ఈ జోడీని మధుశంక విడదీశాడు. అతడు వేసిన 14 ఓవర్ రెండో బంతిని భారీ షాట్ ఆడిన  ఇఫ్తికార్..  అషేన్ బండారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఇఫ్తికార్ ఔటైన కొద్దిసేపటికే  మహ్మద్ నవాజ్ (6) కూడా కరుణరత్నె బౌలింగ్ లో  భారీ షాట్ఆడబోయి  మధూషాన్ కు క్యాచ్ ఇచ్చాడు.  అదే ఓవర్లో రిజ్వాన్.. భారీ సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 16 ఓవర్లు ముగిసేపరికి పాకిస్తాన్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు. అప్పటికీ ఇంకా 24 బంతుల్లో61  పరుగులు చేయాలి. కానీ తర్వాత ఓవర్ వేసిన హసరంగ పాక్ ను కోలుకోనీయని దెబ్బ తీశాడు. 

17వ ఓవర్  వేసిన హసరంగ..తొలిబంతికే రిజ్వాన్ ను ఔట్ చేశాడు అతడు వేసిన  బాల్ ను భారీ షాట్  ఆడబోయిన రిజ్వాన్.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నగుణతిలకకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  మూడో బంతికి అసిఫ్అలీ(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐదో బంతి ఖుష్దిల్ (2)కూడా  తీక్షణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  ఒక్క ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ కోలుకోలేదు.  ఆ తర్వాత ఓవర్ వేసిన తీక్షణ.. షాదాబ్ ఖాన్ (8)పని పట్టాడు. 19వ ఓవర్లో మధుషాన్..నసీమ్ షా  (4)   ను ఔట్ చేశాడు. చివరి ఓవర్లో కరుణరత్నె.. హరీస్ రౌఫ్  (13) ను బౌల్డ్ చేసి లంక విజయాన్ని సమాప్తం చేశాడు. లంక బౌలర్లలో ప్రమోద్ మధుషాన్ కు నాలుగు వికెట్లు దక్కాయి. హసరంగ మూడు వికెట్లు పడగొట్టాడు. చమీక కరుణరత్నె రెండు వికెట్లు తీశాడు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లంక జట్టులో  భానుక రాజపక్స (71 నాటౌట్), వనిందు హసరంగ (36) రాణించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్.. 4 ఓవర్లలో 29పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ లు తలో వికెట్ తీశారు.  

 

The 🦁 of 🇱🇰 roar to victory in to be crowned champions of Asia!

Describe their 6th Asia Cup winning campaign in one sentence!

DP World | | | pic.twitter.com/oahINU8r6R

— Star Sports (@StarSportsIndia)
click me!