Asia Cup: రఫ్ఫాడించిన రాజపక్స.. పాకిస్తాన్ ముందు ఊరించే టార్గెట్ పెట్టిన లంక

By Srinivas MFirst Published Sep 11, 2022, 9:32 PM IST
Highlights

Asia Cup 2022: దుబాయ్ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ లో  తొలి పది ఓవర్లలో లంక పని పట్టిన పాకిస్తాన్ బౌలర్లు  తర్వాత వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ఫలితంగా శ్రీలంక.. నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

ఆసియా కప్ మాజీ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన లంకేయులు ఫైనల్ లో తొలుత తడబడినా  మధ్యలో పుంజుకుని చివర్లో దుమ్ముదులిపింది.  టాపార్డర్ విఫలమైనా  భానుక రాజపక్స (45 బంతుల్లో 71 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)  లోయరార్డర్ తో కలిసి  లంకకు పోరాడే స్కోరును అందించాడు.  పవర్ ప్లే తో పాటు  తొలి పది ఓవర్లలో లంక పని పట్టిన పాకిస్తాన్ బౌలర్లు  తర్వాత వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ఫలితంగా శ్రీలంక.. నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మరి పాకిస్తాన్  ఈ లక్ష్యాన్ని ఛేదించి 2014 తర్వాత ఆసియా కప్ ట్రోఫీని చేజిక్కించుకుంటుందా..? లేదా..? అన్నది కొద్దిసేపట్లో తేలనుంది. 

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో  టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  శ్రీలంకకు తొలి  ఓవర్లోనే నసీమ్ షా షాకిచ్చాడు. మూడో బంతికి  నసీమ్ షా.. ఈ సిరీస్ లో లంక విజయాలలో కీలక పాత్ర పోషించిన   కుశాల్ మెండిస్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  ఆ తర్వాత ఓవర్లో   ధనంజయ.. మహ్మద్ హస్నేన్ బౌలింగ్ లో రెండు బౌండరీలు బాదాడు. ఇన్నింగ్స్  4వ ఓవర్లో  హరీస్ రౌఫ్.. లంకకు మరో షాకిచ్చాడు. రౌఫ్..  4 ఓవర్ రెండో బంతికి  పతుమ్ నిస్సంక (8) ను  ఔట్ చేశాడు. నిస్సంక బాబర్ ఆజమ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.   

ఆ తర్వాత  రౌఫ్..  ఆరో ఓవర్ తొలి బంతికే గుణతిలక (1) నూ క్లీన్ బౌల్డ్ చేశాడు.  దీంతో తొలి పవర్ ప్లే ముగిసేటప్పటికీ  లంక.. 3 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది.  ఇన్నింగ్స్  8వ ఓవర్ ముగిసిన ఇఫ్తికార్ అహ్మద్.. నాలుగోబంతికి ధనంజయ (21 బంతుల్లో 28, 4 ఫోర్లు) ను  పెవిలియన్ పంపాడు. దీంతో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత ఓవర్లో షాదాబ్ ఖాన్..  దసున్ శనక (2) ను బౌల్డ్ చేశాడు. 9 ఓవర్లు ముగిసేటప్పటికీ శ్రీలంక..5 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.

ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన వనిందు హసరంగ (21 బంతుల్లో 36, 5 ఫోర్లు, 1 సిక్సర్  తో కలిసి భానుక రాజపక్స  ఆరో వికెట్ కు 58 పరుగులు జోడించారు. ఇద్దరూ కలిసి ధాటిగా బ్యాటింగ్ చేయడంతో లంక స్కోరు పరుగులెత్తింది. షాదాబ్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో హసరంగ రెండు ఫోర్లు బాదాడు. ఆ  తర్వాత  మహ్మద్ హస్నేన్ వేసిన 13వ ఓవర్లో 4, 6 తో జోరు చూపాడు. హరీస్ రౌఫ్ వేసిన  15వ ఓవర్లో రెండు బ్యాక్ టు బౌండరీలు కొట్టిన హసరంగ.. ఐదో బంతికి వికెట్ కీపర్ రిజ్వాన్ కు చిక్కాడు. 

అనంతరం రాజపక్స.. చమీక కరుణరత్నె  (14 నాటౌట్) తో కలిసి లంకకు  పోరాడే లక్ష్యాన్ని అందించాడు. నసీమ్ షా వేసిన 17వ ఓవర్లో ఐదోబంతికి సిక్సర్ బాదిన రాజపక్స హాఫ్ సెంచరీకి దగ్గరయ్యాడు. అనంతరం  హరీస్ రౌఫ్ బౌలింగ్ లో సింగిల్ తీసి  ఫిఫ్టీపూర్తి చేసుకున్నాడు. నసీమ్ షా వేసిన  చివరి ఓవర్లో రాజపక్స .. ఆఖరి రెండు బంతులకు రెండు భారీ సిక్సర్లు బాది లంక స్కోరును  170 దాటించాడు.   రాజపక్స -కరుణరత్నె 31 బంతుల్లో 54 పరుగులు జోడించారు. 

పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్.. 4 ఓవర్లలో 29పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్ లు తలో వికెట్ తీశారు.  

click me!