విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ... పాకిస్తాన్ ముందు ఊరించే టార్గెట్ పెట్టిన టీమిండియా...

Published : Sep 04, 2022, 09:18 PM IST
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ... పాకిస్తాన్ ముందు ఊరించే టార్గెట్ పెట్టిన టీమిండియా...

సారాంశం

పాకిస్తాన్‌పై మరో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ... మెరుపులు మెరిపించి అవుటైన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్... విఫలమైన మిడిల్ ఆర్డర్...

పాకిస్తాన్‌తో మ్యాచ్ అనగానే వీరలెవెల్లో రెచ్చిపోయే విరాట్ కోహ్లీ, మరోసారి తన క్లాస్ చూపించాడు. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, సూపర్ 4 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో భారత జట్టును ఆదుకున్నాడు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగుల స్కోరు చేసింది భారత జట్టు.

నసీం షా వేసిన తొలి ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు రాబట్టిన రోహిత్ శర్మ, రెండో ఓవర్‌లో మహ్మద్ హస్నైన్ బౌలింగ్‌లో ఓ ఫోర్ బాది 9 పరుగులు రాబట్టాడు.  మూడో ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్ బాదిన కెఎల్ రాహుల్, ఆఖరి బంతికి మరో సిక్సర్ బాదాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు 34 పరుగులకి చేరుకుంది. 

ఐదో ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన కెఎల్ రాహుల్, భారత జట్టు స్కోరుకి 50 పరుగుల మార్కును దాటించాడు. ఆ తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది టీమిండియా...

16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి కుష్‌దిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఏడో ఓవర్ తొలి బంతికే కెఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

కెప్టెన్‌గా ఆసియా కప్‌లో 17 సిక్సర్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. ఇంతకుముందు ఎంఎస్ ధోనీ 16 సిక్సర్లు, షాహిదీ ఆఫ్రిదీ 12, సౌరవ్ గంగూలీ 11 సిక్సర్లు బాది రోహిత్ తర్వాతి స్థానాల్లో నిలిచారు...

టీ20ల్లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మధ్య ఇది 14వ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం. టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యధికం. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి అవుట్ కాగా రిషబ్ పంత్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేశాడు. 

హార్ధిక్ పాండ్యా 2 బంతులాడి డకౌట్ కాగా దీపక్ హుడా 14 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో నిలదొక్కుకుపోయిన విరాట్ కోహ్లీ... మహ్మద్ హస్నైన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...


విరాట్ కోహ్లీకి టీ20ల్లో ఇది 32వ 50+ స్కోరు. రోహిత్ శర్మ రికార్డును అధిగమించి, టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. 44 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఆఖరి ఓవర్‌లో రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆఖరి రెండు బంతుల్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన రవి భిష్ణోయ్, టీమిండియా స్కోరు 180+ దాటించాడు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!
IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..