రోహిత్ శర్మ మళ్లీ అదే తప్పు... మెరుపులు మెరిపించి, ఓపెనర్లు ఇద్దరూ అవుట్...

By Chinthakindhi RamuFirst Published Sep 4, 2022, 8:13 PM IST
Highlights

India vs Pakistan: 62 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టు... మెరుపులు మెరిపించి పెవిలియన్ చేరిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ..

ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టుకి మెరుపు ఆరంభం దక్కింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, భారత జట్టుకి బ్యాటింగ్ అప్పగించాడు...

పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్‌లో తొలి బంతిని ఫేస్ చేసిన రోహిత్ శర్మ, ఈసారి ఆ అవకాశాన్ని కెఎల్ రాహుల్‌కి ఇచ్చాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికి పరుగులేమీ రాకపోయినా రెండో బంతికి సింగిల్ తీసిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మకు స్ట్రైయిక్ అందించాడు...

నసీం షా వేసిన తొలి ఓవర్‌లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు రాబట్టిన రోహిత్ శర్మ, రెండో ఓవర్‌లోనూ అదే దూకుడు చూపించాడు. గాయపడిన దహానీ ప్లేస్‌లో జట్టులోకి వచ్చిన మహ్మద్ హస్నైన్ బౌలింగ్‌లో ఓ ఫోర్ బాదిన రోహిత్ శర్మ, ఆ ఓవర్‌లో 9 పరుగులు రాబట్టాడు...

నసీం షా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్ బాదిన కెఎల్ రాహుల్, ఆఖరి బంతికి మరో సిక్సర్ బాదాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు 34 పరుగులకి చేరుకుంది. హరీస్ రౌఫ్ వేసిన నాలుగో ఓవర్ మొదటి రెండు బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ 12 పరుగులు రాబట్టాడు...

మహ్మద్ నవాజ్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన కెఎల్ రాహుల్, భారత జట్టు స్కోరుకి 50 పరుగుల మార్కును దాటించాడు. ఆ తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది టీమిండియా...

16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి కుష్‌దిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్‌లో వైడ్ల రూపంలో 5 పరుగులు రావడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది భారత జట్టు...

ఏడో ఓవర్ తొలి బంతికే కెఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

కెప్టెన్‌గా ఆసియా కప్‌లో 17 సిక్సర్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. ఇంతకుముందు ఎంఎస్ ధోనీ 16 సిక్సర్లు, షాహిదీ ఆఫ్రిదీ 12, సౌరవ్ గంగూలీ 11 సిక్సర్లు బాది రోహిత్ తర్వాతి స్థానాల్లో నిలిచారు...

టీ20ల్లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మధ్య ఇది 14వ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం. టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యధికం. 

ఈ మ్యాచ్‌కి ముందు ఓవరాల్‌గా పాకిస్తాన్‌పై 9 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 8 ఇన్నింగ్స్‌ల్లో 82 పరుగులు మాత్రమే చేశాడు. పాక్‌పై రోహిత్ శర్మ టీ20 సగటు 13.66 మాత్రమే. స్ట్రైయిక్ రేటు 112.32గా ఉంది... అత్యధిక స్కోరు 30 పరుగులు మాత్రమే...

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలబడ్డాయి. అదే ఏడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, ఫైనల్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్‌పై రోహిత్ శర్మకు ఇదే అత్యధిక స్కోరు...

click me!