
టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియాను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు ఆ మేరకు మరో అడుగు ముందుకేసింది. గ్రూప్ దశలో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్ లో పసికూన హాంకాంగ్ పై ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో భారత జట్టు.. 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని (193) ఛేదించే క్రమంలో హాంకాంగ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవకపోయినా మరీ చెత్తగా ఏమీ ఆడలేదు. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు.. 5 వికెట్లు మాత్రమే పడగొట్టడం గమనార్హం. గెలుపు కోసం చివరి ఓవర్ వరకు పోరాడిన హాంకాంగ్ పోరాట పటిమ ఆకట్టుకుంది. ఇక ఈ విజయంతో గ్రూప్-ఎ లో భారత జట్టు.. అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతో పాటు సూపర్-4 కు అర్హత సాధించింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంకాంగ్ ధాటిగా ఆడేందుకు యత్నించింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో యాసమ్ ముర్తజా (9) రెండు ఫోర్లు కొట్టాడు. కానీ అదే ఓవర్లో ఆఖరుబంతికి అవేశ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన బాబర్ హయాత్ (35 బుంత్లో 41, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. అర్ష్‌దీప్, అవేశ్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్న హయాత్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. రెండో వికెట్ కు కెప్టెన్ నిజకత్ ఖాన్ (10) తో కలిసి 49 పరుగులు జోడించాడు. కానీ నిజకత్ రనౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో అవేశ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి బాబర్ పెవిలియన్ చేరాడు. పది ఓవర్లకు హాంకాంగ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు.
ఆ తర్వాత వచ్చిన కించిత్ షా (28 బంతుల్లో 30, 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడాడు. చాహల్ బౌలింగ్ లో ఫోర్ కొట్టిన అతడు అవేశ్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో సిక్సర్ బాదాడు ఐజజ్ షా (14) తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. కానీ అవేశ్ ఖాన్.. ఐజజ్ ఖాన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్లు చేతిలో ఉన్నా హాంకాంగ్ మాత్రం హిట్టింగ్ కు దిగలేదు. అదే క్రమంలో భారత బౌలర్లు పరుగులను కట్టడి చేయగలిగారే తప్ప అంతగా అనుభవం లేని హాంకాంగ్ బ్యాటర్ల వికెట్లు తీయలేకపోయారు. 16 ఓవర్లు ముగిసేసరికి హాంకాంగ్.. 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడం విశేషం. కోహ్లీ ఆ ఓవర్ లో 6 పరుగులిచ్చాడు.
18వ ఓవర్ వేసిన భువనేశ్వర్.. తొలి బంతికి కించిత్ షా ను ఔట్ చేసి హాంకాంగ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ తర్వాత వచ్చినవారిలో స్కాట్ మెక్‌కిచిని (8 బంతుల్లో 16 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్), జీషన్ అలీ (17 బంతుల్లో 26 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించినా అవి హాంకాంగ్ కు విజయాన్ని అందించలేదు. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. హాంకాంగ్.. సెప్టెంబర్ 2న పాకిస్తాన్ తో తలపడుతుంది. ఈ టోర్నీలో తదుపరి మ్యాచ్ గురువారం శ్రీలంక-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరగనుంది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 68 నాటౌట్, 6 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 59 నాటౌట్, 1 ఫోర్, 3 సిక్సర్లు) అదరగొట్టారు.