
తనకు హైబ్రిడ్ మోడల్ నచ్చలేదని, ఆసియా కప్ - 2023లో పాకిస్తాన్ కు అన్యాయం జరిగిందని బుధవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కాబోయే అధ్యక్షుడు జకా అష్రఫ్ చేసిన వ్యాఖ్యలపై ఆసియన్ క్రికెట్ కౌన్సిల (ఏసీసీ) ఘాటుగా స్పందించింది. జకా అష్రఫ్ కు తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశముందని, కానీ ఆసియా కప్ షెడ్యూల్, వేదికలలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని కుండబద్దలు కొట్టింది.
అష్రఫ్ చేసిన వ్యాఖ్యలపై ఏసీసీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఆసియా కప్ లో హైబ్రీడ్ మోడల్ ను సభ్య దేశాలన్నీ అంగీకరించాయి. అందులో మార్పులేమీ లేవు. పీసీబీతో పాటు జకా అష్రఫ్ ఈ విషయంలో వాళ్లకు నోటికొచ్చింది మాట్లాడుకోవచ్చు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. కానీ మా షెడ్యూల్ లో అయితే మార్పులుండవు..’ అని ఘాటుగా స్పందించాడు.
కాగా బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ మాట్లాడుతూ.. ‘నేను ఈ హైబ్రిడ్ మోడల్‌ను గతంలోనే వ్యతిరేకించా. ఇదో అర్థం పర్థం లేని విధానం. నేను దీనికి అంగీకరించను. ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ఈ ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తానని నిర్ణయించింది. దాని ప్రకారం ఈ టోర్నీ ఇక్కడే జరగాలి. ఈ టోర్నీలో మెయిన్ మ్యాచ్‌లు అన్నీ పాకిస్తాన్ బయిటే జరుగుతున్నాయి. భూటాన్, నేపాల్ వంటి టీమ్స్ మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. ఇది పాకిస్తాన్ కు ఒకరకంగా అవమానమే. గతంలో బోర్డు ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే అవగాహన లేదు. ఆ సమాచారం గురించి నాకు తెలియదు. నేను ఈ తక్కువ వ్యవధిలో ఏం చేయగలనో అది చేస్తా..’ అని కామెంట్స్ చేశాడు.
వెనక్కి తగ్గిన అష్రఫ్..
తన వ్యాఖ్యలపై ఏసీసీతో పాటు సభ్యదేశాల నుంచి వ్యతిరేకత రావడంతో అష్రఫ్ వెనక్కితగ్గాడు. తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, పాత అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం మేరకు టోర్నీని నిర్వహిస్తామని అన్నాడు. ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అష్రఫ్.. ‘నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు హైబ్రీడ్ మోడల్ వల్ల పాకిస్తాన్ కు ఉపయోగంలేదని చెప్పా.ఈ మోడల్ లో పాక్ లో నాలుగు మ్యాచ్ లే జరుగుతుంటే శ్రీలంకలో 9 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇది పాకిస్తాన్ కు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చేది..? అయితే ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. దానికి ఇప్పుడు నేను కట్టుబడి ఉండాలి..’అని తెలిపాడు.
ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఆసియా కప్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.