వర్కవుట్ అయితే బజ్‌బాల్.. కాకుంటే అబాసుపాలు.. స్టోక్స్ ‘ముందస్తు’ వ్యూహం ఫలించేనా..?

Published : Jun 17, 2023, 10:35 AM ISTUpdated : Jun 17, 2023, 10:39 AM IST
వర్కవుట్  అయితే బజ్‌బాల్.. కాకుంటే అబాసుపాలు.. స్టోక్స్  ‘ముందస్తు’ వ్యూహం ఫలించేనా..?

సారాంశం

Ashes Series 2023: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య   ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న  తొలి టెస్టులో బెన్ స్టోక్స్..  తొలి రోజే 78 ఓవర్లు ఆడిన తర్వాతే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. 

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో  ఇంగ్లీష్ జట్టు.. మొదటి రోజే తమ బజ్‌బాల్ దృక్పథాన్ని కంగారూలకు ఘనంగా చాటి చెప్పింది.  ఆట తొలి రోజే 78 ఓవర్లు ఆడి   8 వికెట్లు కోల్పోయి   393 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది.  స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ‘బోల్డ్ కాల్’ అని అందరూ ఆశ్చర్యం  వ్యక్తం చేశారు.  ఆసీస్ ను తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే నిలువరించి.. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసి మ్యాచ్ మీద పట్టుసాధించాలన్నది అతడి వ్యూహం..

గత ఏడాది కాలంగా  బెన్ స్టోక్స్ - బ్రెండన్ మెక్‌కల్లమ్ ల ధ్వయం  బజ్ బాల్ దృక్పథంతో టెస్టు క్రికెట్  ఆడే విధానాన్నే మార్చేస్తున్న విషయం తెలిసిందే.  ‘డ్రా’ అనే పదానికి ఆస్కారమే లేకుండా గెలుపే లక్ష్యంగా ఆడుతోంది ఇంగ్లాండ్.  ఈ ఫార్ములాను తూచా తప్పకుండా పాటిస్తూ  ఈ క్రమంలో ఈ జోడీ 13 టెస్టులలో ఏకంగా 10 టెస్టులను గెలుచుకుంది.

స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇండియా, ఐర్లాండ్ తో పాటు  విదేశాల్లో పాకిస్తాన్, కివీస్ లపై ఇదే ఫార్ములాను  పాటించి ఫలితాలు రాబట్టింది.  ఇందులో భాగంగా యాషెస్  లో కూడా ఇదే  వ్యూహాన్ని స్టోక్స్.. యాషెస్ సిరీస్ తొలి టెస్టులో  ప్రయోగించాడు.   తొలి రోజే దూకుడుగా  ఆడిన ఇంగ్లాండ్.. రన్ రేట్ ఎక్కడా 4.50 కు తగ్గకుండా ఆడింది. రూట్ సెంచరీ, జాక్ క్రాలే, జానీ బెయిర్  స్టో వన్డే తరహా ఆట తో ఆ జట్టు  78 ఓవర్లకే 393 పరుగులు చేసి   ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చింది.  అయితే ఇన్నిరోజులు  ఇంగ్లాండ్ ఆడిన ఆట,  ప్రత్యర్థితో పోల్చితే ఆస్ట్రేలియా  పూర్తి వ్యతిరేకం..  దూకుడైన ఆటకు  వాళ్లు పెట్టింది పేరు. నోటికి పని చెప్పాలన్నా.. వన్డే తరహా ఆట ఆడాలన్నా..  ఏ  రకంగా చూసుకున్నా  ఇంగ్లాండ్  కంటే ఆస్ట్రేలియాదే ఆధిపత్యం..  

కంగారూలతో అంత వీజీ కాదు..

ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ కూడా  చాలా స్ట్రాంగ్ గా ఉంది. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ తో పాటు కమిన్స్  కూడా బ్యాటింగ్  చేయగల సమర్థుడే.   వీరిలో స్మిత్ ఇంగ్లాండ్  కు కొరకరాని కొయ్య. ఇంగ్లాండ్ గడ్డమీద అతడికి ఘనమైన రికార్డు కూడా ఉంది. క్రీజులో కుదురుకుంటే అతడు ఓ పట్టాన ఔట్  అయ్యే రకం కాదు. 

ఇక  తనదైన రోజున డేవిడ్ వార్నర్ ఆటను  పూర్తిగా కంగారూల వైపునకు తిప్పగలడు.  క్రీజులో నిల్చుంటే ఖవాజా, లబూషేన్ లను ఔట్ చేయడానికి  బౌలర్లు చెమటోడ్చాలి.  ట్రావిస్ హెడ్  భీకర ఫామ్ లో ఉన్నాడు. ఆల్ రౌండర్  కామెరూన్ గ్రీన్ పరిస్థితులకు తగ్గట్టుగా చెలరేగుతాడు. మరి  ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ను  ఇంగ్లాండ్ బౌలర్లు ఏ మేరకు నిలువరించగలరు..?

వాళ్లేం తక్కువ తిన్లేదు..  

అలా అని ఇంగ్లాండ్ బౌలింగ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు.  ప్రపంచ క్రికెట్ లోనే బెస్ట్ పేస్ ద్వయం వారి సొంతం. 40 ఏండ్ల వయసులో జేమ్స్ అండర్సన్.. నిప్పులు చెరుగుతున్నాడు.  స్టువర్ట్ బ్రాడ్ కు వార్నర్ తో పాటు ఆసీస్ పైనా అతడికి మంచి రికార్డు ఉంది.  యాషెస్ లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో టాప్ - 5 లో ఉన్న ఏకైక యాక్టివ్ ప్లేయర్ అతడు. ఈ ఇద్దరూ  టెస్టు క్రికెట్ లో ఏకంగా వెయ్యికి పైగా వికెట్లు తీసిన వీరులు. వీరికి  తోడు మరో పేసర్ ఓలీ రాబిన్సన్  కూడా  గత ఏడాదిగా నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ముగ్గురూ చెలరేగితే కంగారూలను నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదు. స్టోక్స్ జమానాలో ఈ ముగ్గురూ ఏడాదికాలంగా ఇంగ్లాండ్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని ఇక్కడ మరువొద్దు..

ఎడ్జ్‌బాస్టన్  స్టేడియం  బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంటుంది. ఇంగ్లాండ్ బజ్ బాల్ దృక్పథంతో దూకుడుగా ఆడి వికెట్లు కోల్పోయింది గానీ కాస్త నిలబడితే ఈ పిచ్ మీద పరుగుల వరద పారించొచ్చు. ఇదే జరిగితే ఆసీస్ బ్యాటర్లను అడ్డుకోవడం ఇంగ్లాండ్ బౌలర్లకు శక్తికి మించిన పనే అవుతుంది. అప్పుడు  స్టోక్స్ ముందస్తు వ్యూహం బెడిసికొట్టినట్టే.. బజ్ బాల్ కాస్త అబాసుపాలు అవడం పక్కా. మరి ఇంగ్లాండ్ బౌలర్లు స్టోక్స్ నిర్ణయాన్ని నిలబెడతారో పడగొడతారో  చూద్దాం.. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?