
ఆస్ట్రేలియా మాజీ సారథి మైఖేల్ క్లార్క్ వివాదంలో చిక్కుకున్నాడు. అతడి గర్ల్‌ఫ్రెండ్ చేతిలో క్లార్క్‌కు అందరూ చూస్తుండగానే బడితెపూజ జరిగింది. ఓ పబ్లిక్ పార్క్ లో జనం అంతా చూస్తుండగా ప్రేయసి చేతిలో క్లార్క్ చావుదెబ్బలు తిన్నాడు. తనను మోసం చేసి మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. క్లార్క్ ప్రేయసి జేడ్ యాబ్రో అతడిపై విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
క్లార్క్‌కు గతంలో కైలీ అనే మహిళతో వివాహమైంది. కానీ ఆమెతో విడిపోయిన అతడు.. ప్రముఖ మోడల్ జేడ్ తో సహజీవనం సాగిస్తున్నాడు. క్లార్క్ ఏ ప్రోగ్రామ్ కు వెళ్లినా జేడ్ ను వెంట తీసుకెళ్తాడు. ఈ ఇద్దరి మధ్య సహజీవనం గురించి ఆస్ట్రేలియా మీడియా గతంలోనే కోడై కూసింది.
ఇదిలాఉండగా.. క్లార్క్ కొద్దికాలంగా జేడ్ ను సైడ్ ట్రాక్ చేసి మరో మహిళ (పిప్ ఎడ్వర్డ్స్) తో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఆసీస్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఇద్దరూ శారీరకంగా కలిశారని ఆరోపిస్తూ జేడ్ తన ప్రియుడిపై కారాలు మిరియాలు నూరింది. తన అన్న, వదిన తోడు రాగా ఓ పబ్లిక్ పార్క్ లో క్లార్క్ ను పట్టుకుని నిలదీసింది. క్లార్క్ ను బండబూతులు తిడుతూ ‘నువ్వు ఆమెతో గడిపావు. డిసెంబర్ 17న నువ్వు ఆమెతో సెక్స్ చేశావ్.. నీకు నేను సరిపోనా..? నువ్వో మదమెక్కిన కుక్కవి..’ అంటూ అతడి మీద విరుచుకుపడింది. ఆ మహిళతో చేసిన చాటింగ్ బయటపెట్టాలని గట్టిగా అరిచింది.
తానేం తప్పుచేయలేదని, తన మాట వినిపించుకోవాలని క్లార్క్.. జేడ్ కు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినా జేడ్ వినలేదు. జేడ్ కొట్టిన దెబ్బలకు క్లార్క్ కు మైండ్ బ్లాక్ అయింది. అతడిని తిట్టిన తిట్టు తిట్టకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. తన మాట ఒకసారి వినాలని క్లార్క్ బతిలాడినా ఆమె వినిపించుకోలేదు. అయితే ఈ వ్యవహారమంతా ముగిసిన తర్వాత క్లార్క్ పార్క్ లో జరిగినదానికి బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
41 ఏండ్ల క్లార్క్ అంతర్జాతీయ కెరీర్ లో ఆసీస్ తరఫున 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్టులలో 8,643 పరుగులు చేసిన క్లార్క్.. వన్డేలలో 7,981 రన్స్ చేశాడు. టెస్టులలో 28, వన్డేలలో 8 సెంచరీలు చేశాడు. 34 టీ20లలో ఒక హాఫ్ సెంచరీ సాయంతో 488 రన్స్ సాధించాడు.