టీమిండియా మెంటార్ గా ధోనీ.. అజయ్ జడేజా ఏమన్నాడంటే..!

By telugu news teamFirst Published Sep 13, 2021, 9:22 AM IST
Highlights

రెండు రోజులు తీవ్రంగా ఆలోచించినా ధోనీ నియామకం వెనక బీసీసీఐకి ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు అంతుచిక్కలేదన్నాడు.
 

టీ20 ప్రపంచకప్ కి సర్వం సిద్ధమైంది. త్వరలోనే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. కాగా.. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు మాజీ సారథి ధోనీని మెంటార్‌గా నియమించిన సంగతి తెలిసిందే. కాగా.. అలా నియమించడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో..  తాజాగా మాజీ ఆటగాడు అజయ్ జడేజా స్పందించాడు. ధోనీని ఇంత అర్జెంటుగా జట్టుకు మెంటార్‌గా నియమించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దీని వెనక ఉన్న రహస్యం తనకు అంతబట్టడం లేదని అన్నాడు. నిజానికి ధోనీకి ఈ ప్రపంచంలో తనకంటే పెద్ద అభిమాని ఎవరూ ఉండరన్న జడేజా.. అయినప్పటికీ బీసీసీఐ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. రెండు రోజులు తీవ్రంగా ఆలోచించినా ధోనీ నియామకం వెనక బీసీసీఐకి ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు అంతుచిక్కలేదన్నాడు.

నిజానికి కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సారథ్యంలోని భారత జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తోందని అన్నాడు. ఈ సమయంలో జట్టుకు మెంటార్‌తో పనిలేదని తేల్చి చెప్పాడు. జట్టుకు ఇప్పటికే ఉన్న కోచ్ జట్టును బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాడని, కాబట్టి ఇప్పటికిప్పుడు మెంటార్‌ను నియమించాల్సిన అవసరం లేదనే తనకు అనిపిస్తోందని జడేజా అన్నాడు. 

అక్టోబరు 17న ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ గురువారం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఆ వెంటనే బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. బీసీసీఐ చేసిన ఈ ప్రకటనపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

click me!