రవి అస్తమించని సామ్రాజ్యపు ఆటగాళ్లు రాకముందే దూతలను పంపనున్న ఈసీబీ.. తేడా వస్తే పాక్ కు మళ్లీ మొండిచేయే..!

Published : Jul 15, 2022, 06:00 PM IST
రవి అస్తమించని సామ్రాజ్యపు ఆటగాళ్లు రాకముందే దూతలను పంపనున్న ఈసీబీ.. తేడా వస్తే పాక్ కు మళ్లీ మొండిచేయే..!

సారాంశం

England Tour Of Pakistan: ఏడేండ్ల తర్వాత ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు రాబోతున్నది.  ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో ఈ పర్యటన  ఉండనుంది.   

గతంలో ఏదైనా ఓ రాజు ఇతర దేశాల రాజులతో సమావేశాలు జరపడమో లేదా ఏమైనా కీలక అంశాలలో చర్చించవలసి వస్తే అతడు ముందుగా తన దూతలను పంపేవాడు. వాళ్లు అక్కడ  రాజు గారి రాకకు గల కారణాలు, అతడి బస, భద్రతా ఇతరత్రా వ్యవహారాలు ముందే వెళ్లి చూసుకునేవారు. ఆధునిక కాలంలో అయితే వివిధ  పేర్లతో ఉన్న పోలీసు బలగాలు ఆ పని చేస్తున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో  అవుతున్నది. ఆ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో పాకిస్తాన్ పర్యటనకు రావాల్సి ఉంది. ఆ మేరకు ఐదుగురితో కూడిన బృందం ఆటగాళ్ల కంటే ముందే వెళ్లి అక్కడ ఏర్పాట్లను పరిశీలించనున్నది.

మరి రవి అస్తమించని సామ్రాజ్యపు (బ్రిటన్) ఆటగాళ్లు ఏడేండ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు  వస్తున్నారంటే ఆ మాత్రం హంగులు ఉండాల్సిందే కదా..  2015 తర్వాత  ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు  తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నది. 

సెప్టెంబర్-అక్టోబర్ లలో ఈ పర్యటన ఉండనున్నది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ తో ఏడు టీ20 లు, మూడు టెస్టులను ఆడాల్సి ఉంది.  ఈ మేరకు  పాకిస్తాన్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి..? భద్రతా లోపాలు తలెత్తకుండా పాకిస్తాన్ ఏ చర్యలు తీసుకుంది..?  టీమ్ హోటల్స్ వంటి తదితర విషయాలు చూసుకోవడానికి గాను ఇంగ్లాండ్  అండ్ వేల్స్  క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతినిధులు పాకిస్తాన్ కు రానున్నారు. జులై 17 న ఐదుగురితో కూడిన ఈసీబీ  ప్రతినిధుల బృందం  రానుంది. 

వీరిలో ఇద్దరు క్రికెట్ ఆపరేషన్స్ అఫిషియల్స్, ఇద్దరు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ , ఒకరు అధికార ప్రతినిధి ఉంటారు. వీళ్లు కరాచీ,  ముల్తాన్, రావాల్పిండి, లాహోర్ (మ్యాచుల వేదికలు) లలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. అంతా బాగుంటే ఓకే గానీ  ఏమైనా తేడాలుంటే పాకిస్తాన్ కు మరోసారి ఆశాభంగం తప్పదు. 

షెడ్యూల్ ప్రకారమైతే ఇంగ్లాండ్ గతేడాదే  పాకిస్తాన్ పర్యటనకు రావలిసి ఉంది. కానీ గతేడాది సెప్టెంబర్ లో న్యూజిలాండ్ జట్టు  రావల్పిండిలో జరగాల్సి ఉన్న వన్డే మ్యాచ్  ప్రారంభానికి ముందు  తమ పర్యటనను రద్దు చేసుకుని కివీస్ కు  వెళ్లిపోయింది. భద్రతా కారణాలను   చూపి కివీస్ ఆ పర్యటనను రద్దు చేసుకుంది. అదే క్రమంలో ఇంగ్లాండ్ కూడా పాక్ కు షాకిచ్చింది. తమ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం తమకు ముఖ్యమని చెప్పిన ఈసీబీ.. ఈ సిరీస్ ను అర్థాంతరంగా రద్దు చేసుకుంది. కానీ తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)  ప్రతినిధులు  ఈసీబీని ఒప్పించి.. పర్యటనకు రావాలని మెప్పించారు.  మరి ఈసీబీ బృందం ఇచ్చే నివేదికపై పాకిస్తాన్-ఇంగ్లాండ్ సిరీస్ ఆధారపడి ఉంది. 

ప్రస్తుతం ఇంగ్లాండ్ ఇండియాతో వన్డే సిరీస్ ఆడుతుండగా.. పాకిస్తాన్  శ్రీలంకతో రెండు టెస్టులు  ఆడేందుకు గాను శ్రీలంకలో ఉంది. ఆసియాకప్-2022 తర్వాత పాకిస్తాన్-ఇంగ్లాండ్ సిరీస్ ఉండనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు