BCCI: అగార్కర్, లక్ష్మణ్ ఔట్.. సెలక్షన్ కమిటీ చైర్మెన్ రేసులో కొత్త ముఖాలు..!

By Srinivas MFirst Published Nov 29, 2022, 11:22 AM IST
Highlights

BCCI New Selection Committee: చేతన్ శర్మ సారథ్యంలోని ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీని బీసీసీఐ ఇటీవలే రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో   కొత్త  సెలక్షన్ కమిటీ కోసం  బీసీసీఐ నామినేషన్లను స్వీకరించింది. 

వరుసగా ఐసీసీ టోర్నీలో భారత జట్టు వైఫల్యం,  కీలక టోర్నీలలో ఉత్తచేతులతో  స్వదేశానికి రావడంతో బీసీసీఐలో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ పై వేటు పడ్డ విషయం తెలిసిందే. చేతన్ శర్మ సారథ్యంలోని  నలుగురు సభ్యులపై బీసీసీఐ ఇటీవలే వేటు వేసింది. దీంతో కొత్త సెలక్షన్ కమిటీకి ఎవరు ఎన్నికవుతారా..? అని ఆసక్తి క్రికెట్ వర్గాలలో నెలకొంది.  ఈ మేరకు  బీసీసీఐ విధించిన  తుది గడువు (నవంబర్ 28) నిన్నటికే ముగిసింది.  

కొత్త సెలక్షన్ కమిటీ చైర్మెన్ రేసులో భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ తో పాటు లక్ష్మణ్ శివరామకృష్ణన్ పేరు కూడా వినిపించింది.  అయితే  వీళ్లిద్దరూ   నామినేషన్లు దాఖలు చేయకపోవడం గమనార్హం..  బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  అగార్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్ నామినేషన్లు దాఖలు చేయలేదు.  కానీ నిన్నటి సాయంత్రం 6 గంటల వరకు  సుమారు వంద అప్లికేషన్లు (ఐదుగురు సెలక్టర్ల పోస్టులకు)  దాఖలైనట్టు తెలుస్తున్నది. 

సెలక్షన్ కమిటీ రేసులో ఉన్నవారిలో  నయాన్ మోంగియా,  హేమాంగ్ బదానీ,   రాజేశ్ చౌహాన్, శివసుందర్ దాస్, మనీందర్ సింగ్, అజయ్ రత్ర, సమీర్ దిఘే లు ఉన్నట్టు సమాచారం. చేతన్ శర్మ అండ్ కో (సునీల్ జోషీ, దేబశీష్ మహంతి, హర్వీందర్ సింగ్) పై వేటు వేసిన తర్వాత  తర్వాత సెలక్షన్ కమిటీ  చైర్మెన్ రేసులో  అగార్కర్, శివరామకృష్ణన్ పేరు గట్టిగా వినిపించింది. ఈ ఇద్దరికీ బోర్డులో మంచి సంబంధాలు, పలుకుబడి ఉండటంతో  ఎవరో ఒకరిని పదవి వరించడం ఖాయం అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా కొత్త ముఖాలు కనిపిస్తుండటం గమనార్హం. 

లక్ష్మణ్ శివరామకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్. ప్రస్తుతం జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ గా ఉన్న శరత్ శ్రీధరన్  కూడా తమిళీయుడే. దీంతో ఒకే  రాష్ట్రం నుంచి ఇద్దరికీ కీలక పోస్టులు ఇవ్వడం కరెక్ట్ కాదనే అభిప్రాయంలో  బోర్డు సభ్యులు ఉన్నట్టు తెలుస్తున్నది. కానీ ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేసిన హేమాంగ్ బదానీ కూడా తమిళ తంబే.  మరి సౌత్ జోన్ నుంచి బదానీ  ఈ రేసులో ఉంటాడా..? లేదా అనేది  డిసెంబర్ లో తేలనుంది.

 

Several candidates including L Sivaramakrishnan, Nayan Mongia, Maninder Singh, Shiv Sunder Das and Ajay Ratra have applied to be part of the next senior BCCI selection committee.
Vijay Dahiya and Hemang Badani are also interested for the posts. (ESPN)

— Dr. Cric Point 🏏 (@drcricpoint)

ఇక వెస్ట్ జోన్ విషయానికొస్తే.. అగార్కర్ తప్పుకోవడంతో మనీందర్ సింగ్ తో పాటు నయాన్ మోంగియాల మధ్య పోటీ నెలకొంది. బీసీసీఐ ట్రెజరరీగా ఉన్న ఆశిష్ సెలార్  మద్దతు ఉన్నా అగార్కర్ మాత్రం ఎందుకు తప్పుకున్నాడో తెలియరాలేదు. దీంతో మోంగియా, మనీందర్ సింగ్ లతో పాటు సలీల్ అంకోలా, సమీర్ దిఘేలు కూడా రేసులోకి వచ్చారు.  

సెంట్రల్, నార్త్ జోన్ నుంచి అజయ్ రత్ర,  అతుల్ వసన్, నిఖిల్ చోప్రా, ఆర్ఎస్ సోధి  లు పోటీలో ఉన్నారు.  ఈస్ట్ జోన్ నుంచి  శివసుందర్ దాస్ , ప్రభంజన్ మాలిక్, ఆర్ఆర్ పర్దియా, ఎస్ లాహిరి లు  పోటీలో ఉన్నారు. 

డిసెంబర్ మొదటివారంలో  బీసీసీఐ  ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం తర్వాత   సెలక్షన్ కమిటీ చైర్మెన్,  సభ్యుల విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజర్ బిన్నీ, జై షా అండదండలు ఎవరికి అందుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

click me!